కట్టుకున్న చీరే మృత్యుపాశమైంది
విశాఖపట్నం : కట్టుకున్న చీరే ఆమె పాలిట మృత్యుపాశమైంది. ప్రమాదవశాత్తు ప్రెస్సింగ్ మెషీన్‌కు చీర చుట్టుకొని లోపలకు లాగేయడంతో దుర్మరణం చెందింది. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలి స్వస్థలం పలాస కాగా, శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాజువాక ఆటోనగర్-ఏ బ్లాక్ మింది రాంనగర్లో వెంకటరమణ ప్లాస్టిక్ పరిశ్రమ ఉంది. ఇందులో ప్లాస్టిక్, రబ్బర్ వంటి స్క్రాప్‌ను భారీ మెషీన్ల ద్వారా ముక్కలుగా కత్తిరించడం, ప్రెస్సింగ్ చేయడం వంటి పనులు నిర్వర్తిస్తుంటారు. గుడివాడ అప్పన్న కాలనీకి చెందిన గొర్లె సత్యవతి (40) నాలుగేళ్లుగా ఈ పరిశ్రమలో పనిచేస్తోంది.
శుక్రవారం పూర్ణమ్మతో కలిసి సత్యవతి ప్రెస్సింగ్ మెషీన్ వద్ద విధులు నిర్వర్తిస్తోంది. హఠాత్తుగా సత్యవతి చీర మెషీన్‌కు చుట్టుకొని ఆమెను లోపలకు లాగే యడంతో శరీరం మొత్తం మెషీన్‌లోకి వెళ్లి ఛిద్రమైంది. సత్యవతిని రక్షించే క్రమంలో ప్లాస్టిక్ వస్తువు తగిలి పూర్ణమ్మ చేతికి తీవ్ర గాయమైంది. ఆమెను గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సీఐ ఎం.అప్పారావు, ఎస్ఐ ఈశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సత్యవతి భర్త సూర్యారావు ఓ ఆస్పత్రిలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరికి 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మృతురాలి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పలాస కాగా ఉపాధి కోసం వలస వచ్చారని బంధువులు తెలిపారు.
మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం
మృతురాలి కుటుంబానికి కంపెనీ యాజమాన్యం రూ.6 లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించిందని స్థానిక నాయకులు పేర్కొన్నారు. కంపెనీ యాజమాన్యంతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. దీంతోపాటు ఇతర ఖర్చులకు రూ. 25 వేలు అందజేయటానికి అంగీకరించినట్లు తెలిపారు.