రెప్ప వాల్చని సిటీ
►రాత్రంతా వాట్సప్, ఫేస్బుక్లో బిజీ
►నిద్రలేమితో యువతలో ఒత్తిడి
►నేడు వరల్డ్ స్లీపింగ్ డే..
‘కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది..కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది’మనసు కవి ఆత్రేయ చెప్పిన మాట ఇది. కానీ నగరవాసి ఆ అవకాశానికి దూరమయ్యాడు. పగలే కాదు.. రాత్రంతా నిద్రను మరిచిపోయి సామాజిక మాధ్యమాల్లో మునిగితేలుతున్నాడు. అపరిమిత నెట్‌డేటా ఆఫర్లు.. ఫేస్బుక్, వాట్సప్ టెక్నాలజీ కలిసి సిటీజన్ల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రి తొమ్మిది గంటలకే నిద్రపోవాల్సిన వారు అర్ధరాత్రి దాటినా పరిసరాలను మరిచిపోయి స్మార్ట్ ఫోన్‌తోనే గడుపుతున్నారు. ‘ప్రపంచ స్లీపింగ్ డే’ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సిటీబ్యూరో:అందివచ్చిన టెక్నాలజీని అతిగా వాడుతున్న సిటీజన్లు కొత్త సమస్యలను కొని తెచ్చుకొంటున్నారు. రాత్రంతా సోషల్ నెట్‌వర్క్‌లో నిమగ్నమై మానకిస ఒత్తిడికి లోనవుతున్నారు. ఫేస్బుక్, వాట్సప్ వంటివి అతివాడకంతో గ్రేటర్లో దాదాపు 40 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నట్లు ఎయిమ్స్–స్టార్ వైద్యుల సర్వేలో వెల్లడైంది. ఇది ప్రత్యక్షంగా మానసిక ఒత్తిడి, చిరాకు, కోపం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలకు కారణమతున్నట్టు గుర్తించారు. దీంతోపాటు తోటి ఉద్యోగుల మధ్య హుషారుగా తిరగాల్సినవారు నీరసంగా ఉంటుండంతో ఉపాధి అవకాశాలనూ పోగొట్టుకుంటున్నారు.
ప్రతి పదిమందిలో ముగ్గురు బాధితులే
ఇటీవల టెలికామ్ సంస్థల మధ్య పోటీ పెరిగింది. వినియోగదారులకు ‘అపరిమిత’ ఆఫర్లు అందుబాటులోకి తెచ్చాయి.. ఇంకా తెస్తున్నాయి. మరోపక్క ప్రజలకు ఇంటర్నెట్ వాడకం అలవాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం.. నగరంలో 49 చోట్ల వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడం.. ఈమెయిల్, చాటింగ్, వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సర్వీసులు 24 గంటలూ పనిచేస్తునే ఉన్నాయి. అయితే, కొంతమంది దీన్ని కమ్యూనికేషన్ స్కిల్స్పెంచుకోవడం కోసం వినియోగిస్తుంటే, చాలామంది వినోదం కోసం వాడుతున్నారు. దీంతో నిద్రపోయే సమయంలోనూ వీటిలోనే బిజీగా గడుపుతున్నారు. ఫలితంగా నగరంలో ప్రతి పదిమందిలో ముగ్గురు నిద్రలేమితో బాధపడుతున్నట్లు వైద్యుల పరిశోధనలో తేలింది. ఈ బాధితుల్లో ఎక్కువ మంది పాతికేళ్లలోపు వారేనని తేల్చారు.