కథ మారింది
ఆవేశం... మనిషిని మనిషిలా ఉండనివ్వదు.ఎంతకైనా దిగజారుస్తుంది.ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుంది.అది తెలిసి కూడా ఆవేశాన్ని అణచుకోలేకపోయాడు ఆస్కార్ పిస్టోరియస్. ‘బ్లేడ్న్న్రర్’గా ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఆస్కార్... ఆవేశమనే శత్రువును అణచుకోలేక అదే ప్రపంచం ముందు దోషిలా నిలబడ్డాడు. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు!
అక్టోబర్ 21, 2014...
దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా కోర్టు కిటకిటలాడుతోంది. ఎప్పుడూ లేనంత నిండుగా ఉంది. అక్కడున్న అందరి ముఖాల్లోనూ ఆతృత కనిపిస్తోంది. ఏం జరగబోతోంది అన్న ప్రశ్న అందరి కళ్లలోనూ కదలాడుతోంది. దు వరుసలో బెంచీమీద కూర్చున్న వ్యక్తి ముఖమైతే బాగా పాలిపోయింది. టెన్షన్ పడుతున్నట్టుగా పెదవులు అదురుతున్నాయి. భీతితోనో, బాధతోనో గానీ... కళ్లు మాటిమాటికీ చెమ్మగిల్లు తున్నాయి. తల దించుకుని పదే పదే వేళ్లతో కళ్లను ఒత్తుకుంటున్నాడు. తలో హాలులో చిన్నపాటి అలికిడి. న్యాయమూర్తి రావడంతో అందరూ లేచి నిలబడ్డారు. ఆవిడ కూర్చోగానే కూర్చున్నారు. న్యాయమూర్తి కాసేపు తన దగ్గరున్న కాగితాలను తిరగేసింది. అప్పుడప్పుడూ తలెత్తి కోర్టులో వారందరినీ పరిశీలించింది. మధ్యమధ్యన ఆ వ్యక్తివైపు కూడా నిశితంగా చూసింది. కాసేపటి తర్వాత చేతిలోని కాగితాలను టేబుల్ మీద పెట్టి పెదవి విప్పింది.
‘‘కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదట... రీవా స్టీన్‌క్యాంప్‌ను తుపాకితో కాల్చి, ఆమె మరణానికి కారకుడైనందుకుగాను... ఆస్కార్ పిస్టోరియస్కు ఐదేళ్ల కారాగారశిక్ష విధించడమైనది.’’
అందరూ ఆశ్చర్యపోయారు. హతురాలి తల్లి అయితే హతాశురాలైంది. ‘‘ఇది అన్యాయం. నా కూతుర్ని పొట్టనబెట్టుకున్నవాడికి, ఓ నిండు జీవితాన్ని బలి తీసుకున్నవాడికి శిక్ష కేవలం అయిదేళ్లా?’’ అంటూ బావురుమంది. వేదనతో అక్కడ్నుంచి బయటకు వెళ్లిపోయింది.ఆ వ్యక్తి తన ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకున్నాడు. దుఃఖపడుతున్నాడనడానికి సాక్ష్యంగా అతడి భుజాలు రెండూ కదులుతున్నాయి.
‘‘మిస్టర్ పిస్టోరియస్... లేవండి వెళ్దాం’’
ఇన్స్పెక్టర్ గొంతు వినగానే కళ్లు తుడుచుకుని లేచాడా వ్యక్తి. ఓసారి చుట్టూ చూశాడు. దూరంగా నిలబడి తనవైపే చూస్తోన్న తల్లి, చెల్లిని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. బలవంతాన అదిమి పెట్టి, పోలీసుల వెంట వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయాడు. అతడు పోలీసుల వాహనంలోకి ఎక్కుతుంటే కాస్త దూరం నుంచి చూస్తోన్న హతురాలి తల్లి అరుస్తోంది... ‘‘వాడు రాక్షసుడు. నా కూతురి ప్రాణాలు హరించాడు. ఈ శిక్ష వాడికి చాలదు. చూస్తూండండి. వాడు త్వరలో మరో నేరం చేసినా చేస్తాడు’’.
ఆమె మాటలకు కొందరు అవాక్క య్యారు. కొందరు జాలిపడ్డారు. కొందరు ఆమెను తప్పుబట్టారు. ఎందుకంటే ఆవిడ మాట్లాడింది ముక్కూ ముఖం తెలియని ఓ సామాన్య వ్యక్తి గురించి కాదు. ప్రపంచమే గొప్పగా చెప్పుకునే అథ్లెట్ గురించి. కాళ్లు లేకపోయినా కృత్రిమకాళ్లతో రికార్డులు సాధించిన పరుగుల వీరుడి గురించి. బ్లేడ్ రన్నర్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే... ఆస్కార్ పిస్టోరియస్ గురించి! త గొప్ప ఆటగాడు, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు... హత్య చేశాడా? ఎందుకు? అసలిది నిజమేనా? లేక తప్పుడు కేసా? అసలింతకీ ఏం జరిగింది? ఆస్కార్ నేరస్తుడా? అమాయకుడా?
ఫిబ్రవరి 14, 2013...
‘‘ఏం జరిగింది సర్... అంబులెన్స్ కోసం ఫోన్ చేశారెందుకు?’’... లోపలకు అడుగు పెడుతూనే అడిగాడు అంబులెన్స్‌తో పాటు వచ్చిన మేల్ నర్స్.
ఆస్కార్ మాట్లాడలేదు. నీళ్లు నిండిన కళ్లతో నిస్తేజంగా చూస్తున్నాడు.
‘‘చెప్పండి సర్. ఏం జరిగింది? మీ ఆరోగ్యం బాగానే ఉందా?’’ అన్నాడతను కంగారుగా. తన అభిమాన ఆటగాడికి ఏమయ్యిందోనన్న కంగారు అతడిలో.
ఈసారి కూడా ఆస్కార్ సమాధానం చెప్పలేదు. అటు చూడమన్నట్టుగా చేతిని చాచాడు. చూసిన నర్స్ ఉలిక్కిపడ్డాడు. అక్కడ... నేలమీద... రక్తపు మడుగులో అచేతనంగా పడివుంది ఓ అమ్మాయి.
‘‘ఎవరు సర్... ఏమయ్యింది?’’ అన్నాడతను కంగారుగా. ప్రాణాలతో ఉందేమో చూద్దామని దగ్గరకు వెళ్లబోయాడు. అప్పుడు పెగిలింది ఆస్కార్ గొంతు.
‘‘తను చనిపోయింది’’
బ్రేక్ వేసినట్టు ఆగిపోయాడతడు. ‘‘ఎలా సర్?’’ అన్నాడు అయోమయంగా.
‘‘నేనే చంపేశాను’’ బావురుమన్నాడు ఆస్కార్. అవాక్కయిపోయాడా వ్యక్తి. వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. విషయం పోలీసుల చెవిని వేశాడు.
‘‘తల, నడుము, భుజం... మూడు చోట్ల బుల్లెట్లు దిగాయి. అంత దారుణంగా ఎలా చంపగలిగారు మిస్టర్ పిస్టోరియస్?’’ సూటిగానే అడిగాడు ఇన్స్పెక్టర్.
‘‘కావాలని చేయలేదు సర్. బాత్రూమ్లో అలికిడి అవుతుంటే దొంగ దూరాడేమో అనుకున్నా. బయటకు రమ్మన్నా రాకపోవడంతో షూట్ చేశా. కానీ...’’
‘‘కానీ లోపల ఉన్నది దొంగ కాదు. మీ ప్రియురాలు రీవా. మిమ్మల్ని నమ్మి, మీతోనే కలిసి జీవిస్తోన్న రీవా. త్వరలోనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కలలు కంటోన్న రీవా. అంతే కదూ?’’
‘‘మీ మాటల్లో వ్యంగ్యం నాకు అర్థమయ్యింది సర్. కానీ నేను చెప్పింది నిజం. నేను తనని చంపలేదు. దొంగ అనుకుని షూట్ చేస్తే తను చనిపోయింది.’’
‘‘అవునా... అయినా దొంగ బాత్రూములో ఎందుకుంటాడు మిస్టర్ పిస్టోరియస్?’’
‘‘బాత్రూమ్లో ఓ కిటికీ ఉంది. దానిగుండా జొరబడ్డాడేమో అనుకున్నాను.’’
వెటకారంగా నవ్వాడు ఇన్స్పెక్టర్. ఆస్కార్ ఎన్ని చెప్పినా అతడు నమ్మలేదు. ఎందుకంటే, అతడు చెప్పేది నమ్మశక్యంగా లేదు కాబట్టి. ఆస్కార్‌ని ప్రాణంగా ప్రేమించింది రీవా స్టీన్‌క్యాంప్. ప్రముఖ మోడల్ అయిన ఆమె ఆస్కార్‌కి అర్ధాంగి కావాలని ఆశపడింది. చివరికి అతడి చేతిలోనే హత్యకు గురయ్యింది. స్కార్ చెప్పినదాని ప్రకారం... ఫిబ్రవరి పద్నాలుగు తెల్లవారుజామున నిద్రలో ఉండగా... బాత్రూమ్లో ఏదో అలికిడి వినిపించి మెలకువ వచ్చింది ఆస్కార్‌కి. ఎవరూ అని అరిచాడు. సమాధానం రాలేదు. దాంతో తుపాకీ తీసుకుని బాత్రూమ్ దగ్గరకు వెళ్లాడు. తలుపు లోపల నుంచి గడియ పెట్టి వుంది. ఎంత పిలిచినా లోపలి వ్యక్తి తలుపు తీయలేదు. దాంతో తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. తర్వాత ఎందుకో మంచం వైపు చూస్తే రీవా కనిపించలేదు.
ఆస్కార్ అమాయకుడని అతడి అభిమానులు నమ్మినా... అతగాడి స్వభావం తెలిసినవాళ్లంతా అతడినే దోషి అంటున్నారు. బరిలో ఆత్మవిశ్వాసంలో పరుగులు తీసే ఆస్కార్... వ్యక్తిగత జీవితంలో ఆవేశంతో తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చాడు. రెండుసార్లు పబ్లిక్ ప్లేసుల్లో కొట్లాటలకు దిగి, కోపాన్ని అణచుకోలేక తుపాకీతో కాల్పులు జరిపాడు. కేసుల పాలయ్యాడు. మూడేళ్ల పాటు క్రీడా రంగంలో నిషేధానికి గురయ్యాడు. కోపం వస్తే కంట్రోల్ తప్పిపోయే అతగాడు, రీవాని కావా లనే ఎందుకు చంపివుండకూడదు అన్నది పలువురి సందేహం. అది నిజమే కావచ్చు. కానీ న్యాయస్థానం అలా ఆలోచించనప్పుడు చేసేదేముంది! అన్యాయం జరిగింది అని భావిస్తే... రీవా ఆత్మశాంతికి ప్రార్థించడం తప్ప!
అనుమానం వచ్చి క్రికెట్ బ్యాట్‌తో తలుపు పగులగొట్టాడు. లోపల కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది రీవా. తనను ఎలాగైనా కాపాడుకోవాలని అంబులెన్సు కోసం ఫోన్ చేసి, ఆమెను చేతుల్లో ఎత్తుకుని హాల్లోకి తీసుకొస్తుండగానే సమయం మించిపోయింది. రీవా ఊపిరి ఆగిపోయింది.
ఇదీ ఆస్కార్ పోలీసులకు, కోర్టుకు చెప్పిన విషయం. అయితే జరిగినదానికీ, దొరికిన సాక్ష్యాలకీ, ఆస్కార్ చెప్పినదానికీ ఏమాత్రం పొంతన కుదరలేదు. రీవాకి బుల్లెట్లు తగిలిన విధానాన్ని బట్టి ఆమె వెస్ట్రన్ కమోడ్ మీద కూర్చుని ఉంది. అప్పుడే ఆస్కార్ షూట్ చేశాడు. అతడి పిలుపు వినివుంటే ఆమె బదులు పలికేది కదా! లేచి తలుపు తీసేది కదా! అన్నిసార్లు పిలిచినా ఎందుకు మాట్లాడదు! పోనీ ఏదైనా గొడవ జరిగిందా? కోపంతో పలకలేదా? లేదంటే ఏ కారణం చేత అయినా అతడికి భయపడి దాక్కుని ఉందా? అలా అనుకున్నా నిలబడి ఉంటుంది కానీ ఎందుక్కూర్చుంటుంది?
అలికిడి వినగానే కృత్రిమకాళ్లు అమర్చుకోకుండానే పాకుతూ బాత్రూమ్ దగ్గరకు వెళ్లానని, తర్వాత మంచం వైపు చూస్తే రీవా లేదని, దాంతో వెళ్లి కాళ్లు అమర్చుకుని వచ్చి తలుపు పగుల గొట్టానని, ఆమెను ఎత్తుకుని కిందికి తీసుకొచ్చానని ఆస్కార్ చెప్పాడు. నడవలేని వ్యక్తి ఎవరైనా.... తనతో పాటు ఒక మనిషి ఉన్నప్పుడు, అలికిడి అవగానే అదేంటో చూడమని ఆ మనిషితో చెప్తాడు కానీ, తనే ఎందుకు పాక్కుంటూ వెళ్తాడు? మరో విషయం... పిలిచినప్పుడు ఆమె కావాలని పలకకపోయినా, మొదటి బుల్లెట్ తగలగానే కేక పెడుతుంది కదా! అది విని అయినా ఇక కాల్చడం మానేయాలి కదా!
ఈ ప్రశ్నల్లో వేటికీ ఆస్కార్ దగ్గర సమాధానం లేదు. దాంతో రీవా తల్లి చెప్పిన మాటలు నిజమేనేమో అనిపించింది పోలీసులకు. రీవా ఆస్కార్‌ని ప్రాణంగా ప్రేమించిందని, కానీ అతడు అసూయాపరుడని, పురుషాహంకారంతో రీవాని హింసించేవాడనీ ఆమె చెప్పింది. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన రీవా, అతడికి దూరమైపోవాలనుకుంటున్నట్టు ఆ రోజు రాత్రే తనతో చెప్పిందని అందామె. ఆ రాత్రి తెల్లవారకముందే రీవా మృత్యు వాత పడింది. బహుశా వదిలి వెళ్తానం దన్న కోపంతోనే రీవాని చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసిందామె.
ఎలా చూసినా సాక్ష్యాలన్నీ ఆస్కార్‌కు వ్యతిరేకంగానే ఉన్నాయి. అందుకే అతడికి జీవితఖైదు పడొచ్చని చాలామంది అనుకున్నారు. కానీ కేవలం ఐదేళ్లు శిక్ష వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. న్యాయమూర్తి మసిపాకు ఆస్కార్ చేసింది హత్య అనిపించలేదు. దొంగ అనుకునే కాల్పులు జరిపాడని నమ్మిందామె. అందుకే ఐదేళ్లు శిక్ష విధిస్తున్నానని చెప్పింది. కానీ అది న్యాయమేనా? అతడు చెప్పేదానిలో ఏ మాత్రం వాస్తవం ఉన్నట్టు అనిపించకపోయినా, దొరికిన సాక్ష్యాలన్నీ అతడే దోషి అని నిరూపిస్తున్నా... పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేశాడంటూ తక్కువ శిక్షను వేయడం సబబేనా? ఇరవై తొమ్మిదేళ్ల వయసులో చేయని తప్పుకు బలైపోయిన రీవాకు న్యాయం జరిగినట్టేనా?!!
- సమీర నేలపూడి