ఆత్మహత్యల నివారణకు ఫేస్ బుక్ టూల్స్
నిరుత్సాహంతో, నైరాశ్యంతో పెరిగిపోతున్న ఆత్మహత్యలను నివారించడంపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక టూల్స్‌ను ఆవిష్కరించింది. భారత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ టూల్స్ ప్రవేశపెట్టింది. ఈ టూల్స్‌ను గతేడాదే అమెరికాలోకి అందుబాటులోకి తెచ్చింది. ఫోర్ ఫ్రంట్, లైఫ్ లైన్, సేవ్.ఆర్గ్ సంస్థల భాగస్వామ్యంతో ఈ టూల్స్ ను ఫేస్ బుక్ అమెరికాలోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం భారతదేశంతో పాటు అన్ని దేశాల్లోకి తీసుకొచ్చేసింది. భారత్ లో దీపికా పదుకొనే లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్, ఆస్రాల సహకారంతో ఈ టూల్స్ ను ప్రవేశపెట్టింది. భారత్ లో ఫేస్ బుక్ అందుబాటులో ఉన్న అన్ని భాషలు.. బెంగాలీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూల్లోకి ఈ టూల్స్ ను తీసుకొచ్చింది.
మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణ సంస్థలతో కలిసి ఫేస్ బుక్ ఈ టూల్స్‌ను డెవలప్ చేసింది. స్నేహితుడు నైరాశ్యంలో, నిరుత్సాహంతో ఉండడాన్ని సోషల్ మీడియా కాంటాక్టుల ద్వారా, చాటింగ్స్ ద్వారా యూజర్లు గుర్తించినప్పుడు ఆ సమాచారాన్ని వేగంగా ఇతరులతో షేరు చేసుకోవడం, ఆ వ్యక్తికి ధైర్యాన్ని నింపడం వంటి చర్యలకు ఈ టూల్స్ సహకరిస్తాయి. తమ స్నేహితుడు ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్న విషయాన్ని గుర్తించిన స్నేహితులు నేరుగా ఫేస్ బుక్ గ్లోబల్ టీమ్ కు కూడా రిపోర్టు చేయవచ్చు. ఇలా స్నేహితులను ఆత్మహత్యల నుంచి బయటపడేయొచ్చని ఫేస్ బుక్ పేర్కొంది. ఎవరైనా ప్రమాదంలో ఉన్నారని భావిస్తే వెంటనే ఎమర్జెన్సీ సర్వీసులను కాంటాక్టు చేసేలా ఫేస్ బుక్ యూజర్లకు సూచించనుంది. ఫేస్ బుక్ సపోర్టు చేసే అన్ని భాషల్లో ఈ టూల్స్ అందుబాటులోకి ఉండనున్నాయి.