జూన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ యోజన
నేడు బనగానపల్లెలో వ్యవసాయాధికారులకు శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్) : ఈ ఏడాది జూన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ యోజన బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. రైతుల కష్టాన్ని విపత్తులు ఊడ్చి పెడుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినూత్నంగా ప్రవేశపెట్టిన ఫసల్ యోజన అన్నదాతల్లో భరోసాను నింపుతోంది. ఈ పథకంపై మంగళవారం వ్యవసాయ అధికారులకు బనగానపల్లె మండలం యాగంటి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ బీమా పథకానికి ఖరీఫ్ అన్ని పంటలకు 2 శాతం ప్రకారం, వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంది.
రబీ పంటలకు 1.5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఈ బీమా పథకంలో పంటలకు నష్టం జరిగినప్పుడు కేంద్ర బృందాలు సందర్శించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపాల్సిన అవసరం ఉండదు. నష్టపోయిన రైతు స్మార్ట్ ఫోన్ ద్వారా పంట వివరాలను అధికారులకు పంపినట్లయితే తక్షణ సహాయం కింద 25 శాతం నష్టపరిహారం లభిస్తుంది.
ఆధునిక టెక్నాలజీ (డ్రోనులు, ఉపగ్రహాల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వంటివి) ఉపయోగించి పంట నష్టాన్ని అంచనా వేయడం ద్వారా త్వరగా పరిహారాన్ని అందుంతుందని అధికారులు తెలిపారు. ఈ బీమా పథకం జూన్ నుంచి అమల్లోకి రానుంది. దీని కింద 33 శాతం పంట నష్టం జరిగితే చాలు పరిహారం లభిస్తుంది.