'రామకృష్ణ' డిగ్రీ కళాశాల పరీక్ష ఫలితాలు విడుదల
నంద్యాల (కర్నూలు) : స్థానిక రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాల మూడో సంవత్సరం పరీక్ష ఫలితాలను గురువారం ఉదయం ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అటానమస్ కళాశాల కావడంతో రాయలసీమ యూనివర్శిటీ ఆదేశాల మేరకు ఫలితాలను ప్రకటించినట్లు ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. తమ కళాశాలలో మొత్తం ఏడు కోర్సుల్లో 651మంది పరీక్షలకు హాజరు కాగా 575మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 135మంది డిస్టింక్షన్లో 325మంది, ప్రథమ శ్రేణిలో 77మంది, తృతీయ శ్రేణిలో ఉతీర్ణత సాధించినట్లు తెలిపారు. బీఏ, బీబీఎంలో 100శాతం ఉత్తీర్ణత సాధించగా బీఎస్సీలో ఎంఎస్సీఎస్, ఎంఈసీఈసీలలో 90శాతం, ఎంపీసీలో 94శాతం, బీకాం కంప్యూటర్స్‌లో 86శాతం, జనరల్‌లో 71శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు.
కళాశాలలోని అన్ని గ్రూప్‌లపై అత్యధిక మార్కులను ఎంపీసీఎస్ బ్రాంచ్‌కు చెందిన పి.బేబిఆశ (92.19శాతం) ప్రథమ స్థానంలోను నిలిచి బంగారు పతకాన్ని సాధించినట్లు తెలిపారు. అలాగే ఎంపీసీఎస్‌కు చెందిన కె.విజయలక్ష్మి(91.42), ఎంఎస్‌సీఎస్‌కు చెందిన కిరణ్‌కుమార్(90.62)లు ద్వితీయ, తృతీయ శ్రేణిలో నిలిచారన్నారు. ఒక సబ్జెక్టులో 6వ సెమిస్టర్లో 50మంది ఫెయిల్ అయ్యారని వారికి, మూడు సంవత్సరాల్లో ఒకటి, రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిన వారికి పదిరోజుల్లో పరీక్షలను నిర్వహించి ఏడాది వృథా కాకుండా అవకాశం కల్పిస్తామన్నారు.
కవల పిల్లల అద్భుత ప్రతిభ..
కళాశాలలో బీఏ చదువుతున్న ఇద్దరు కవల విద్యార్థినులు అద్భుత ప్రతిభను చూపారు. వ్యవసాయ కార్మిక కుటుంబానికి చెందిన సుజాత, సునీతలది కోవెలకుంట్ల మండలంలోని కలుగొట్ల గ్రామం. 18-05-95లో ఎర్రగడిండ్ల శివుడికి కవల పిల్లలుగా జన్మించారు. వీరు బీఏలో చేరి కళాశాల టాపర్స్‌గా నిలిచారు. సుజాతకు మూడు సంవత్సరాల్లో 2209మార్కులు సాధించగా సునీత 2108మార్కులు సాధించి ఇరువురు డిస్టింక్షన్లో నిలిచారు. ఇంటర్మీడియెట్‌లో కూడా వీరి ఇరువురు కోవెలకుంట్ల గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ చదివి సుజాత 886, సునీత 786మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. సివిల్సే లక్ష్యంగా వీరు ముందుకు సాగుతున్నారు.