గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్
ఆత్మకూరురూరల్ : గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆత్మకూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె.మురళీకష్ణను సస్పెండ్ చేశారు. ఈ మేరకు గురుకుల పాఠశాలల విద్యాలయాల సంస్థ సెక్రటరీ నుంచి బుధవారం ఉత్తర్వులు అందాయి. గత నెల 24వ తేదీన గురుకుల పాఠశాలలో చదువుతున్న కోటకు చెందిన ఓ విద్యార్థినిని ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులకు తెలపడంతో వారు పాఠశాలకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలుత ఐటీడీఏ పీఓ కమలకుమారి, ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ, ఎస్ఐ ఎం.పూర్ణచంద్రరావు విచారణ నిర్వహించారు. గురుకుల పాఠశాలల విద్యాలయాల సంస్థ డిప్యూటీ కార్యదర్శి విచారణ నిర్వహించారు. ఈ నివేదికల ఆధారంగా ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ కె.మురళీకష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు పంపారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడంతో సస్పెన్షన్ ఉత్తర్వులను అతని ఇంటి తలుపులకు అంటించారు. నాలుగేళ్లుగా ఆ ప్రిన్సిపల్ గురుకుల పాఠశాలలో పని చేస్తున్నాడు.