కాఠిన్యానికి పరాకాష్ట
వేళ్లు లేని కుష్ఠు రోగులకు మంజూరు కాని పింఛన్లు
వేలిముద్రలు వేస్తేనే స్మార్ట్ కార్డులని నిబంధన
నాలుగు నెలలుగా అందని వైనం
లబోదిబోమంటున్న బాధితులు
విధి వంచితులు.. నిస్సహాయుల విషయంలో మానవత్వంతో వ్యవహరించడం మన కనీస కర్తవ్యం. మనుషులమైనందుకు అది మన సహజ లక్షణం. అయితే అనేక సందర్భాల్లో ఆ మానవ(తా)ధర్మం మరుగున పడుతోంది. దయ, కరుణ మాయమై కాఠిన్యం కమ్ముకుంటోంది. దాంతో సాయం పొందాల్సిన దీనులు కష్టాల పాలవుతున్నారు. ఆదుకునేవారు లేక వేదనతో విలవిలలాడుతున్నారు. అనకాపల్లిలో అదే జరుగుతోంది. పట్టణం చేరువలో కృష్ణాపురం లెప్రసీ కాలనీలో కుష్ఠు పీడితుల కష్టం తెలిసే మనసు కరిగిపోతుంది. ఇక్కడ సుమారు 40 మందికి నాలుగు నెలలుగా పింఛన్లు ఇవ్వడం లేదు. వేలిముద్రలు వేస్తే తప్ప ఇవ్వబోమని అధికారులు కరాఖండీగా చెబుతున్నారు. అయితే ఏం.. అంటారా? ముద్ర వేయడానికి వారికి వేళ్లే లేవు! వ్యాధి వల్ల వేళ్లే లేకుంటే ముద్రలేం వేస్తామని ఆ బాధితులు బావురుమంటున్నారు.
అనకాపల్లి టౌన్, న్యూస్‌లైన్: చూపులేని వాడిని ‘ఏం కనిపించదా?’ అని ప్రశ్నిస్తే ఎంత వేదన కలుగుతుంది! కాళ్లు లేనివాడిని ‘నడిచి రాలేవా?’ అని గద్దిస్తే ఎంత బాధనిపిస్తుంది! అనకాపల్లి లెప్రసీ కాలనీలో నిర్భాగ్యులకు అధికారులు వేస్తున్న ప్రశ్నలు వింటే వారికే కాదు.. మనకూ మనస్సు చివుక్కుమనిపిస్తుంది. నిబంధనలంటూ కఠినంగా వ్యవహరిస్తున్న వారి తీరు చూస్తే అయ్యో అనిపిస్తుంది. వేళ్లే లేని వారు వేలి ముద్రలు వేయాలని పట్టుబడుతున్న తీరు చూస్తే ఆగ్రహం తారస్థాయికి చేరుతుంది.
అనకాపల్లి పట్టణం సమీపంలోని కృష్ణాపురం లెప్రసీ కాలనీ రోగుల పింఛను వ్యవహారాన్ని పరిశీలిస్తే అధికారుల తీరు ఆవేదన కలిగిస్తుంది. నాలుగు నెలలుగా పింఛను దక్కక నానా పాట్లూ పడుతున్న వారి దీన స్థితి హృదయాన్ని ద్రవింపజేస్తుంది. పట్టణంలోని రామకృష్ణాపురం సమీపంలో 1972లో ప్రభుత్వం లెప్రసీ కాలనీ ఏర్పాటు చేసింది. 31 ఇళ్లల్లో 115 మంది ఉంటున్నారు. వీరిలో 65 మంది లెప్రసీ రోగులు. 40 మందికి ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ ఇస్తోంది.
నాలుగు నెలల క్రితం వరకు వీరికి పింఛను సక్రమంగా అందేది. ప్రభుత్వం స్మార్ట్ కార్డుల ద్వారా పింఛన్ల పంపిణీ ప్రారంభించడంతో వీరి కష్టాలు మొదలయ్యాయి. పింఛను పొందాలంటే వేలిముద్రలు తప్పనిసరయ్యాయి. అదే లెప్రసీ రోగులకు శాపంగా మారింది. ఈ నలభైమంది రోగులకు చేతి వేళ్లులేవు. వేలి ముద్రలు లేవన్న కారణంగా నాలుగు నెలలుగా వీరికి అధికారులు పింఛన్ ఇవ్వడం లేదు.
పింఛన్‌పైనే ఆధారపడి బతుకుతున్న వీరంతా ఏపనీ చేయలేని అసహాయ స్థితిలో ప్రస్తుతం యాచకులుగా మారి పొట్టపోసుకుంటున్నారు. నిబంధన వాస్తవమే అయినా తమకు వేళ్లేలేనప్పుడు వేలి ముద్రలు ఎలా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమ పరిస్థితిని చూసి ప్రత్యామ్నాయ నిబంధన పెట్టాలన్నా ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లేని వేళ్లు ఎలా తేగలం?
వేలి ముద్రలు లేవని నాలుగు నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదు. లేని వేళ్లు ఎలా తేగలం? పింఛన్ సొమ్ముతోనే జీవిస్తున్నాం. ఇప్పుడు అదికూడా రాకపోవడంతో ఇబ్బంది ప డుతున్నాం. అధికారులు మా సమస్యను అర్ధం చేసుకోవాలి. - డోకర గోపి, లెప్రసీ బాధితుడు
అధికారులు అవమానిస్తున్నారు
చేతి వేళ్లుంటేనే పింఛన్ మం జూరు చేస్తామని అధికారులు అవమానకరంగా మాట్లాడుతున్నారు. పింఛన్ అందక, ప్ర త్యామ్నాయ ఉపాధి లేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాం. గత్యంతరం లేక మండుటెండలో యాచన చేసి బతుకుతున్నాం.
- మావూరి మల్లేష్, లెప్రసీ కాలనీ ప్రెసిడెంట్
ఇవ్వకపోవడం వాస్తవమే
నాలుగు నెలల నుంచి పింఛన్లు ఇవ్వకపోవడం వాస్తవమే. వేలిముద్రలు లేని కారణంగా, స్మార్ట్ కార్డుల పంపిణీ జరగలేదు. ఈ సమస్యను డీఆర్డీఏ పీడీ ద్వారా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. వచ్చే నెల నుంచి వేలి ముద్రలు వేయలేని లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వేలిముద్రలను సేకరించి పంపిణీ చేస్తాం.
-జగదీష్, మణిపాల్ సర్వీస్ ప్రొవైడర్ మేనేజర్.