20, 21 తేదీల్లో జాతీయ సదస్సు
పెనుగొండ : మానవ హక్కుల విద్యపై పెనుగొండ ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ నరసింహరాజు తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించబోయే జాతీయ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్, హైకోర్టు మాజీ జడ్జి జి.భవానీ ప్రసాద్, ఆదికవి నన్నయ్య విశ్యవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు అతిథులుగా పాల్గొంటారన్నారు. కీలకోపన్యాసకులుగా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల వేదిక సభ్యులు ఆచార్య జి. హరగోపాల్, విశిష్ట అతిథిగా రాష్ట్ర హక్కుల కమిషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డి.సుబ్రహ్మణ్యం హాజరవుతారన్నారు.
ముగింపు సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మహిళా విద్యా కేంద్ర సంచాలకులు డాక్టర్ దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, ఆచార్య బి.రత్నకుమారి పాల్గొంటారన్నారు. సెమినార్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సూర్యనారాయణరాజు మాట్లాడుతూ జాతీయ సదస్సుకు ఇప్పటివరకూ 82 పరిశోధనా వ్యాసాలు అందడం కళాశాల చరిత్రలో విశేషమన్నారు. 20న కళాశాలలో మానవవనరుల అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. కళాశాల పాలకవర్గ సంయుక్త కార్యదర్శి పెన్మెత్స వెంకట సుబ్రహ్మణ్యం, సెమినార్ కార్యదర్శి కె.శశికుమార్, కేవీ.సురేష్‌బాబు, డి.త్రిమూర్తులు పాల్గొన్నారు.