కాసులకు కక్కుర్తిపడి.. కటకటాల్లోకి..
నకిలీ చలానాలతో రూ.26 లక్షలు స్వాహా
కాకినాడ మున్సిపాలిటీలో 1999-2005 మధ్య జరిగిన బాగోతం
అవినీతికి పాల్పడిన ఉద్యోగులకు శిక్ష ఖరారు
ముగ్గురికి రెండేళ్లు.. 11 మందికి ఆరు నెలలు జైలు
రూ.94 వేల జరిమానా
కాకినాడ లీగల్ :
పురపాలక సంఘానికి జమ కావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయాన్ని.. నకిలీ చలానాలతో కైంకర్యం చేసిన ఉద్యోగులు ఎట్టకేలకు కటకటాలపాలయ్యారు. దాదాపు పదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం.. మున్సిపల్ ఆదాయానికి గండికొట్టి రూ.26 లక్షలు
స్వాహా చేసిన కేసులో 14 మంది ఉద్యోగులకు జైలు శిక్ష పడింది. సుమారు రూ.94 వేల జరిమానా కూడా విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో కాకినాడ నగరపాలక సంస్థలో కలకలం రేగింది.
కుమ్మక్కై.. కైంకర్యం
ప్రస్తుతం నగరపాలక సంస్థగా రూపు దిద్దుకున్న కాకినాడ.. 2005 ముందు వరకూ పురపాలక సంఘంగా ఉండేది. 1999-2005 మధ్య టౌన్‌ప్లానింగ్ విభాగంలో అప్పటి టీపీఎస్ జేడీ ఆనందకుమార్తోపాటు దాదాపు 14 మంది సిబ్బంది కుమ్మక్కై నకిలీ చలానాలు సృష్టించి రూ.26 లక్షలు స్వాహాచేసినట్టు ఆరోపణలు వచ్చాయి. కేటీపీఎస్తో పాటు సంబంధిత సిబ్బంది కుమ్మక్కై.. భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చే ప్రజల నుంచి సొమ్ము వసూలు చేసి.. దానిని మున్సిపల్ ఖజానాకు జమ చేయకుండా.. నకిలీ చలానాలు సృష్టించి కైంకర్యం చేశారు. వారి అవినీతి బాగోతానికి నాలుగైదేళ్లపాటు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
ఆడిట్‌తో వెలుగులోకి..
వీరి బాగోతం 2005లో జరిగిన ఆడిట్‌తో బయటపడింది. దీనిపై అప్పటి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సీబీసీఐడీకి ఫిర్యాదు చేశారు. అప్పటి మున్సిపల్ స్పెషలాఫీసర్ దానకిషోర్, కలెక్టర్ జవహర్‌రెడ్డి కూడా ఈ అంశాన్ని సీబీసీఐడీ దృష్టికి తీసుకువెళ్లారు. ఐపీసీ సెక్షన్ 408, 409, 477(ఎ), 120బి కింద సీబీసీఐడీ కేసులు నమోదు చేసి, విచారణ జరిపింది. ఈ విచారణలో 250 నకిలీ చలానాల ద్వారా సుమారు రూ.26,68,356 స్వాహా చేసినట్టు నిర్ధారించారు. అప్పట్లో ఈ ఉద్యోగులందరినీ సస్పెండ్ చేశారు. కొన్ని నెలల తరువాత తిరిగి వీరికి పోస్టింగ్ ఇచ్చారు. వారు ప్రస్తుతం కాకినాడ నగరపాలక సంస్థతోపాటు పలు ప్రాంతాల్లో వివిధ కేడర్లలో పని చేస్తున్నారు.
పదేళ్ల విచారణ అనంతరం..
న్యాయస్థానంలో పదేళ్లు సాగిన విచారణ అనంతరం ఉద్యోగులపై మోపిన అభియోగాలు నిర్ధారణ అయ్యాయి. దీంతో వీరందరికీ జైలు శిక్ష విధిస్తూ కాకినాడ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి, సీబీసీఐడీ మెజిస్ట్రేట్ కె.శివశంకర్ మంగళవారం సాయంత్రం తీర్పు ఇచ్చారు. సీనియర్ ఏపీపీ ఎంవీఎస్ఎస్ ప్రకాశరావు ప్రాసిక్యూషన్ నిర్వహించారు.
శిక్షపడింది వీరికే..
ఈ కేసులో అప్పటి జూనియర్ అసిస్టెంట్లు కొంగారపు వెంకటేశ్వరరావు (ఏ1), మల్లెల వెంకటరమణశాస్త్రి (ఏ2), అటెండర్ అల్లంపల్లి సత్యప్రసాద్(ఏ12)లకు రెండేళ్ల జైలుశిక్ష విధించారు. ఈరాపోతుల రుక్మిణీకుమారి (సీనియర్ అసిస్టెంట్), గొరుగుంట్ల నర్సమాంబ (జూనియర్ అసిస్టెంట్), పిర్ల గంగారావు (జూనియర్ అసిస్టెంట్), దాసరి లక్ష్మి (జూనియర్ అసిస్టెంట్), వేదుల చంద్రశేఖర్ (జూనియర్ అసిస్టెంట్), మాచగిరి ఏసుబాబు (జూనియర్ అసిస్టెంట్), గుర్రపు మారుతీ ప్రేమస్వరూప్ (జూనియర్ అసిస్టెంట్), బుర్రా రామారావు (జూనియర్ అసిస్టెంట్), కట్టా భాస్కరరావు (సీనియర్ అసిస్టెంట్), సిరవరపు భూషణరావు (క్యాషియర్), జలాది డేవిడ్ అనంద్‌కుమార్ (టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్)లకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. అందరికీ కలిపి మొత్తం రూ.94 వేల జరిమానా కూడా విధించారు.