ప్రాంతాల వారీగా వివరాల్లేవు
అప్పులు, ఆస్తులపై సర్కారు స్పష్టీకరణ
రాజధాని హైదరాబాద్లోనే వివిధ రకాల పన్నుల చెల్లింపు
కేంద్ర, రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించి ప్రాంతాల వారీగా లేదు
ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు, ప్రస్తుత విలువ ప్రాంతాల వారీగా లేదు
జిల్లా ట్రెజరీల వారీగా ఆదాయ, వ్యయాలు
రంగారెడ్డి ట్రెజరీ ద్వారా రూ.21064.62 కోట్లు
హైదరాబాద్ ట్రెజరీ ద్వారా 15,754.82 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రాంతాల వారీగా అప్పులు, ఆస్తుల వివరాలు ప్రస్తుతం ఒకే చోట అందుబాటులో లేవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్గా ఉన్నందున అనేక రకాల పన్నులను వివిధ సంస్థలు హైదరాబాద్ ట్రెజరీ ద్వారానే చెల్లిస్తున్నారని, ఏ ప్రాంతం నుంచి ఎంత ఆదాయం అనేది ప్రస్తుతం జిల్లా ట్రెజరీల ఆధారంగానే చెప్పగలమని ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ లోటు వివరాలకు సంబంధించిన సమాచారం కూడా ప్రాంతాలు, జీహెచ్ఎంసీ వారీగా లేవని రాష్ట్రం మొత్తానికి మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది.
రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో చర్చ నేపథ్యంలో ఆదాయ, వ్యయాలకు సంబంధించి జిల్లా ట్రెజరీల వారీగా సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సభ్యులకు అందచేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.1,127.9 కోట్ల రెవెన్యూ మిగులు తేలిందని... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ నాటికి రూ.1,739.91 కోట్ల రెవెన్యూ మిగులు తేలిందని అందులో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 31 డిసెంబర్ నాటికి ట్రెజరీలో నిలిచిన బిల్లుల విలువ రూ.3,941.27 కోట్లని తెలిపింది. అదేవిధంగా గత 55 సంవత్సరాల నుంచి కేంద్ర, రాష్ర్ట పెట్టుబడులకు సంబంధించి ప్రాంతాల వారీగా సమాచారం లేదని స్పష్టం చేసింది. అలాగే ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు, ఆ సంస్థల విలువ ప్రాంతాల వారీగా లేదని పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ నెల వరకు రంగారెడ్డి జిల్లా ట్రెజరీ నుంచి అత్యధికంగా రూ.21,064.62 కోట్ల రూపాయల ఆదాయం రాగా హైదరాబాద్ (పట్టణ) ట్రెజరీ నుంచి రూ.15,754.82 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకు హైదరాబాద్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫీసర్ కార్యాలయం ద్వారా వివిధ రంగాలకు చేసిన వ్యయం రూ.20,009.90 కోట్ల రూపాయలు. జిల్లా ట్రెజరీల వారీగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ 30 వరకు వచ్చిన ఆదాయం, వ్యయాలకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వ్యయానికి సంబంధించి ప్రణాళిక, ప్రణాళికేతర కలిసి ఉన్నాయి.