ఈ‘సారీ’ ప్రైవేటు విత్తే!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : విత్తనోత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (తెలంగాణ సీడ్ కార్పొరేషన్) వరుస వైఫల్యాలు చెందుతోంది. జిల్లాకు అవసరమైన సోయా విత్తనాలను ఉత్పత్తి చేయడంలో ఈ సంస్థ ఈసారి కూడా విఫలమైంది. గత ఏడాది (2017) ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాలను స్వయంగా ఉత్పత్తి చేసేందుకు 2016లో చర్యలు చేపట్టింది. ఈ చర్యలు ఫలితాలనివ్వలేదు. దీంతో గత ఖరీఫ్ సోయా విత్తనాలను ప్రభుత్వం ప్రైవేటు విత్తన కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా అదే వైఫల్యం పునరావృతమైంది. ఈసారి సోయా విత్తనోత్పత్తిలో విఫలమైంది. తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ వరుస వైఫల్యాలు ప్రైవేటు విత్తన సంస్థలకు పరోక్షంగా ప్రయోజనం చేకూర్చుతోందనే ఆరోపణలను మూటగట్టుకుంటోంది.
జిల్లాలో నెరవేరని ఉత్పత్తి లక్ష్యం..
ఈ ఖరీఫ్ సీజనులో జిల్లాకు అవసరమైన సుమా రు 40 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలను నిజామాబాద్ జిల్లాలోనే స్వయంగా ఉత్పత్తి చేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. అయితే 1,600 క్వింటాళ్లు మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, బోధన్ తదితర ప్రాంతాల్లో విత్తనాలు పండించే రైతులకు ఫౌండేషన్ సీడ్ ఇచ్చి సోయా విత్తనోత్పత్తి చేయాలని రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది. 2017 సెప్టెంబర్ చివరి వారంలో, అక్టోబర్ మొదటి వారంలో కురిసిన వర్షానికి ఈ విత్తనం పనిచేయకుండా పోయిందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చేతులెత్తేసింది. 40 వేల క్వింటాళ్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యానికి గాను కేవలం 1,600 క్వింటాళ్లతో సరిపెట్టి చేతులు దులుపుకుంది. దీంతో జిల్లా విత్తనాల అవసరాల కోసం ప్రభుత్వం ప్రైవేటు విత్తన కంపెనీల వద్ద కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఈసారి సోయా విత్తనాలు సరఫరా చేసే విత్తన కంపెనీలు ధరను పెంచేశాయి. క్వింటాలుకు సుమారు రూ.400 వరకు అధిక ధరకు సర్కారుకు విక్రయిస్తోంది.
కోత దశలో వర్షం కురవడంతో అనుకున్న మేరకు జిల్లాలో విత్తనోత్పత్తి జరగలేదని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ రాజీవ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.
తెలంగాణను విత్తన భాండాగారంగా..
తెలంగాణను విత్తన భాండాగారంగా మార్చుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను స్వయంగా ఉత్పత్తి చేయడంతో పాటు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కానీ విత్తనోత్పత్తే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్రవిత్తనాభివృద్ధి సంస్థ జిల్లాలో ఈ విత్తనాలను ఉత్పత్తి చేయలేకపోయింది.
ప్రైవేటు..
సోయా పంటను అత్యధికంగా సాగు చేసే జిల్లాల్లో నిజామాబాద్ ఒకటి. 2017 ఖరీఫ్‌లో 99 వేలు ఎకరాలు సాగైంది. ఈ ఖరీఫ్‌లో సుమారు 91వేల ఎకరాల్లో సోయా సాగువుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం 73,586 క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సోయా విత్తనాలను ఉత్పత్తి చేయలేకపోవడంతో ప్రభుత్వం ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి రైతులకు సబ్సిడీపై అందజేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రూ.కోట్లలో నిధులు ప్రైవేటు విత్తన కంపెనీలకు చెల్లించాల్సి వస్తోంది.
ఐదు ప్రభుత్వ రంగ సంస్థలకు పంపిణీ బాధ్యతలు
ఈ ఖరీఫ్ సీజనుకు అవసరమైన 73 వేల క్వింటాళ్ల సోయా సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసే బాధ్యతలను ప్రభుత్వం ఐదు ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించింది. తెలంగాణ సీడ్ కార్పొరేషన్‌కు 49 వేల క్వింటాళ్లు అలాట్మెంట్ ఇచ్చింది. అలాగే హాకా, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, నేషనల్ సీడ్ కార్పొరేషన్లకు ఈ బాధ్యతలను అప్పగించింది. 102 కేంద్రాల ద్వారా రైతులకు ఈ సబ్సిడీ సోయా విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది.