గంజాయి గ్యాంగ్ గుట్టురట్టు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా ముంబైకి గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠా గుట్టును సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు రట్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి రూ.10 లక్షల విలువ చేసే 148 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎస్ఓటీ ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి తెలిపిన ప్రకారం... ఖమ్మం జిల్లా పాలెం మండలం సుబ్లాదే గ్రా మానికి చెందిన రైతు కొండా ఉపేందర్ (28), ప్రైవేట్ సెక్యూరిటీగార్డు గంధా శ్రీనాగరాజు (27), టైలర్ వేదులపరుపు వీరాంజనేయులు (35) త్వరగా డబ్బు సంపాదించి ధనవంతులు కావాలని గంజాయి స్మగ్లింగ్ మొదలెట్టారు.
విశాఖపట్నం, అన్నవరం, జీముదుల్లా ప్రాంతాల నుంచి గంజాయిని నగరానికి తెచ్చి.. ఇక్కడి నుంచి ముంబైకి తరలిస్తున్నారు. పది, ఐదు కిలోల చొప్పున లగేజీ బ్యాగులలో గంజాయిని నింపి.. ఎవరీ అనుమానం రాకుండా ప్ర యాణికుల్లా ప్రైవేట్ బస్సుల్లో నగరానికి తెస్తున్నారు. ఈ ‘సరుకు’ను బాలానగర్ రాజుకాలనీలో అద్దెకు తీసుకున్న గదిలో భద్రపర్చి.. ఆ తర్వాత ముంబైకి తరలిస్తున్నారు. వీరి వ్యవహారంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు విశ్వసనీయ సమాచారం అందింది.
ఆయన ఆదేశాల మేరకు ఎస్ఓటీ ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ కుషాల్కర్, ఎస్.రమేష్‌లు శుక్రవారం అర్ధరాత్రి రాజుకాలనీలోని స్మగ్లర్ల గదిపై దాడి చేశారు. ఉపేందర్, వీరాంజనేయులు, నాగరాజులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన 148 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును బాలానగర్ పోలీసులకు అప్పగించారు.