'వ్యక్తులుగా పాకిస్థాన్‌ను గెల్చుకోలేం'
న్యూఢిల్లీ: 120 కోట్ల మంది భారతీయులు ఒక్కటిగా నిర్ణయం తీసుకుంటే తప్ప దాయాది పాకిస్థాన్ విషయంలో విజయం సాధించలేమని, ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఈ విషయంలో వ్యక్తిగతంగా ఎవ్వరూ విజయం సాధించలేరని విదేశాంగ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సాల్మన్ ఖుర్షీద్ అన్నారు.
'ఇలాంటి సందర్భంలో అందరి భాగస్వామ్యం అవసరం. అలా కాని పక్షంలో అది సగంమంది ప్రజల అభిప్రాయంగా మాత్రమే పరిగణలో ఉంటుంది. మోదీ అనుసరిస్తున్న పోలీస్‌మెన్ ఫారిన్ పాలసీతో పాక్‌ను దారికి తెచ్చుకోం' అని ఆదివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుర్షీద్ అన్నారు. ఏడాది కాలంగా ప్రధాని మోదీ పలు విదేశీ పర్యటనలు చేశారని, వాటివల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం ఒనగురలేదని ఎద్దేవాచేశారు.