ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాకే విమానాశ్రయాల ప్రైవేటీకరణ
న్యూఢిల్లీ: ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తమ ఆధ్వర్యంలోని నాలుగు విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియను మానవ వనరులపరమైన సమస్యలను పరిష్కరించిన తర్వాతే చేపట్టనున్నట్లు ఏఏఐ చైర్మన్ ఆర్కే శ్రీవాస్తవ చెప్పారు. ఇందుకోసమే అర్హత దరఖాస్తుల సమర్పణ కు ఆఖరు తేదీని మార్చి 24 నుంచి మే 26కి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు.
ఉద్యోగులలో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం తొలగిస్తుందని, వారి ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూస్తుందని ఆయన చెప్పారు. కోల్కతా, చెన్నై, జైపూర్, అహ్మదాబాద్ ఎయిర్పోర్టులను ప్రైవేటీకరించడం వల్ల ఏఏఐ ఆదాయం మరింత తగ్గిపోతుందని, ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోతపడుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే.