ప్రైవేటు ప్లాంట్లు కొనేద్దాం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) గడువు తీరే మూడు ప్రైవేటు ప్లాంట్లు కొనేసేందుకు విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఇప్పటికే స్థిరచార్జీల రూపంలో ఆయా ప్లాంట్ల పెట్టుబడిని ప్రజలు చెల్లించేశారు. దీంతో తక్కువ ధరకు ఈ ప్లాంట్లను కైవసం చేసుకునేందుకు రెండు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇప్పటికే నిర్ణయానికి వచ్చాయి. ఇందుకు అనుగుణంగా ఏ ప్లాంటుకు ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందనే లెక్కలు ‘థర్డ్‌పార్టీ’ద్వారా తీయిస్తున్నాయి. మరోవైపు ప్లాంట్లను కొనుగోలు చేయాలంటే తమకు భారీగా చెల్లించాల్సి ఉంటుందంటూ సదరు కంపెనీలు అంచనాలను సమర్పించాయి. అయితే, కేవలం 240 కోట్లు చెల్లిస్తే... పీపీఏలోని క్లాజు కింద ఏకంగా 779 మెగావాట్ల గ్యాస్విద్యుత్ ప్లాంట్లు ప్రభుత్వపరం అవుతాయని (బయ్‌అవుట్) అధికారులు అంచనా వేస్తున్నారు.
అధికంగా అంచనాలు ఇచ్చిన కంపెనీలు
ప్రభుత్వపరం కాకుండా తమ కంపెనీలను కాపాడుకునేందుకు ప్రైవేటుప్లాంట్ల యాజమాన్యాలు మరమ్మత్తులు, ఆధునీకరణ (ఆర్‌అండ్‌ఎం) పేరిట తీవ్రయత్నాలు చేస్తున్నాయి. కొనుగోలు చేయాలంటే తమకు 500 కోట్లు-600 కోట్ల మేర భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి. దీనికంటే ఆర్ ఎండ్ ఎం మేలనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. అయితే, ఆర్ అండ్ ఎం చేపడితే తిరిగి ప్లాంటు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళుతుంది. మరమ్మతులకు అయిన మొత్తాన్ని మరి కొన్నేళ్లపాటు సర్కార్ చెల్లించాల్సివస్తుంది. ఇది ప్రజలకు భారంగా పరిణమిస్తుంది. ఈ నేపథ్యంలో ప్లాంట్లను కొనుగోలు చేయడానికే డిస్కంలు నిర్ణయించాయి. యాజమాన్యాల వాదనలతో అధికారులు ఏకీభవించడం లేదు. కేవలం 250 కోట్ల మేరకు చెల్లిస్తే మూడు ప్లాంట్లు ప్రభుత్వపరం అవుతాయని భావిస్తున్నారు. పీపీఏలోని క్లాజుల ప్రకారమే థర్డ్‌పార్టీని నియమించాలని డిస్కంలు నిర్ణయించాయి. థర్డ్‌పార్టీకి మదింపు బాధ్యతను అప్పగించి, అది ఇచ్చే నివేదికపై ప్రైవేటుప్లాంట్లతో చర్చించాలని డిస్కంలు భావిస్తున్నాయి.
బయ్ అవుట్ క్లాజ్ ఏం చెబుతోంది?
ప్రైవేటుగ్యాస్ ఆధారిత విద్యుత్‌ప్లాంట్లతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్ఈబీ) పీపీఏలు కుదుర్చుకుంది. దాని పరిమితి 15 సంవత్సరాలు. జీవీకేతో కాలపరిమితి వచ్చే జూన్ నాటికి ముగియనుంది. ఇక ల్యాంకోతో డిసెంబర్ 2015 నాటికి, స్పెక్ట్రమ్‌తో జనవరి 2016కు కాలపరిమితి ముగియనుంది. పీపీఏలోని 11.7 క్లాజు బయ్అవుట్కు అవకాశం కల్పిస్తోంది. బయ్‌అవుట్ చేయాలంటే సదరు కంపెనీకి 540 రోజుల ముందుగా నోటీసులు జారీచేయాలని, ఇందుకయ్యే మొత్తాన్ని విద్యుత్ సంస్థలు ఒకేసారి చెల్లించాలి. లేదంటే గతంలో ఉన్నట్టుగానే పీపీఏ అమల్లో ఉంటుంది. అలాగే, కంపెనీలకు స్థిర, అస్థిర చార్జీలను యథాతథంగా చెల్లించాల్సి ఉంటుంది అని ఈ క్లాజు స్పష్టం చేస్తోంది. దీనికి అనుగుణంగా ప్రైవేట్ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు నోటీసులు జారీచేశాయి. వచ్చేఏడాది జూన్‌లో పీపీఏ గడువు ముగియనున్న జీవీకే-1ను కైవసం చేసుకునేందుకు కేవలం 50 కోట్ల మేరకు చెల్లిస్తే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్లాంట్ల నుంచి ఒప్పందం మేరకు తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం విద్యుత్ లభించనుంది.