కాలిబాటకు పెద్దపీట: హెచ్ఎండీఏ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో కాలిబాటలకు పెద్దపీట వేయాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నిత్యం రోడ్లపైకి వస్తున్న వాహనాల సంఖ్యను లెక్కలోకి తీసుకొని, వాటి ఆధారంగా రోడ్లు, కూడళ్ల విస్తరణ చేపడుతున్నారు. అయితే రోడ్లపై నిత్యం 60 శాతం మంది పాదచారులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిని పరిగణనలోకి తీసుకోకపోవడం, వాహనాల పార్కింగ్ అంశాన్ని విస్మరించడం వల్లే పాదచారుల సమస్య యథాతథంగా ఉంటోంది.
ఈ క్రమంలో పాదచారులకు, సైక్లిస్ట్‌లకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి సౌకర్యాలు కల్పిస్తే కానీ సమస్య పరిష్కారం కాదని ‘సమగ్ర రవాణా అధ్యయనం (సీటీసీ)’పై గురువారం బుద్ధపూర్ణిమ ప్రాజెక్టులో జరిగిన సమావేశంలో ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. పాదచారులు, సైక్లిస్టుల సమస్యలు, మోటారు రహిత రవాణా, పార్కింగ్ విధానంపై జీహెచ్ఎంసీ, పోలీసు, జలమండలి తదితర విభాగాల ఉన్నతాధికారులతో హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్‌ప్రసాద్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
హైదరాబాద్‌లో సమగ్ర రవాణాపై లీ అసోసియేట్స్ సంస్థ జరిపిన అధ్యయనం తాలూకు ప్రాథమిక పరిశీలన పత్రాలను ఆయన సమావేశం దృష్టికి తెచ్చారు. అదే సందర్భంలో ఇటీవల ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, పాదచారుల నడకయాతనలపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం నగరంలో ఫుట్‌పాత్‌లు పాదచారుల రద్దీకి త గ్గట్టు ఉన్నాయా? ఏ మేరకు విస్తరించాలి? ఏయే ప్రాంతాల్లో విస్తరించాలి? వంటి అంశాలపై లోతుగా చర్చించారు.
నడకయాతన తప్పిస్తేనే మార్గం సుగమం
నగరంలో చాలా వరకు ఫుట్‌పాత్‌లు ఆక్రమణల పాలవడంతో పాదచారులంతా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ఫలితంగా వాహనాలు సాఫీగా ముందుకెళ్లలేని పరిస్థితి ఎదురవుతోంది. పాదచారులు, సైక్లిస్ట్‌లకు నిర్దేశిత మార్గాలు లేకపోవడం, ఉన్నా వినియోగంలో లేకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడుతోంది. వాస్తవానికి ఫుట్‌పాత్ 1.8 మీటర్ల వెడల్పు, 6-9 అంగుళాల ఎత్తు ఉండాలి. అబిడ్స్, అమీర్‌పేట, కోఠి, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం ప్రాంతాల్లో కాలిబాటలన్నీ కుంచించుకుపోయాయి.
ఈ క్రమంలో కీలక మార్గాల్లో పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు ప్రత్యేక సిగ్నల్స్, ఇతర సూచికలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ, జలమండలి తవ్వకాల సందర్భంలో ఫుట్‌పాత్‌లను దృష్టిలో పెట్టుకొని సెట్‌బ్యాక్స్ నిర్ణయించాలని, విద్యుత్, వరద, నీటి పైపులైన్లు ఫుట్‌పాత్‌ల కిందకు రాకుండా చూడాలని నిర్ణయించారు. అన్ని విభాగాలు సంయుక్తంగా పని చేస్తేనే ఇవన్నీ సాధ్యమని హెచ్ఎండీఏ కమిషనర్ సమావేశం దృష్టి తెచ్చారు.
నాలుగు మార్గాల్లో..
పాదచారులు, సైక్లిస్ట్ల రాకపోకలకు అనువుగా సౌకర్యాలు కల్పించేందుకు నాలుగు ప్రధాన మార్గాల్లో ఫుట్‌పాత్‌లు అభివృద్ధి చేయాలని సమావేశం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా తలపెడుతున్న ఈ పనులను తొలుత ఏయే ప్రాంతాల్లో చేపట్టాలన్నది సర్వే సంస్థే నిర్ణయించి సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తయారు చేయాలని అధికారులు సూచించారు. ప్రత్యేకించి పాదచారులు, సైక్లిస్ట్ల సౌకర్యాలకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించి, అన్ని విభాగాల అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆపై అమల్లోకి తేవాలని నిర్ణయించారు.
నగరంలో మోటారురహిత రవాణా వ్యవస్థ!
నగరంలో మోటారు రహిత రవాణా వ్యవస్థను అమల్లోకి తేవాలని హెచ్ఎండీఏ భావి స్తోంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ నగరాల్లో అమలవుతున్న కాలుష్య రహిత రవాణా వ్యవస్థను గ్రేటర్‌లోనూ అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్టు (ఎన్ఎంటీ) పాలసీ, పార్కింగ్ పాలసీలపై మరింత లోతుగా అధ ్యయనం చేయించాలని నిర్ణయించింది.
పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి
నగరంలో పార్కింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కీలక ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ లాట్స్ లేవు. వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలిపేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో గ్రేటర్లో మల్టీలెవెల్ పార్కింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని సీటీఎస్ సమావేశం అభిప్రాయపడింది. ఇందుకు నగరంలో ఏయే ప్రాంతాల్లో అవకాశాలున్నాయనే దానిపై చర్చించింది. వివిధ నగరాల్లో అమలువుతున్న పార్కింగ్ వ్యవస్థలను పరి శీలించి.. అటువంటి పద్ధతుల్ని ఇక్కడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దీనిపై నివేదిక రూపొందించే బాధ్యతను అధికారులు లీ అసోసియేట్స్ సంస్థకు అప్పగించారు. సమావేశంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కమిషనర్లతో పాటు మెట్రోరైల్, జలమండలి ఎండీలు, విద్యు త్, ట్రాఫిక్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.