Producers Welfare
-
ఇతర భాషా చిత్రాలను నిలువరించండి
తమిళసినిమా: తమిళ నిర్మాతల మండలి సమ్మెకు ఇతర భాషా చిత్రాలు గండికొడుతున్నాయా? ఎగ్జిబిటర్లు దిగిరాకపోవడానికి అవికారణం అవుతున్నాయా? ఇతర భాషా చిత్రాల విడుదల తమిళ నిర్మాతలను కలవరపెడుతున్నాయా? వాటిని నిలువరించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికి కోలీవుడ్‌లో అవుననే బదులే వస్తోంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు నిర్మాతల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారంటూ వాటిని తగ్గించే విధంగా ఆ సంస్థల అధినేతలతో నిర్మాతలమండలి జపిన చర్చలు విఫలం కావడంతో మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త చిత్రాల విడుదలను నిలిపి వస్తూ నిర్ణయం తీసుకున్న నిర్మాతల మండలి అదే నెల 16 నుంచి షూటింగ్‌లతో పాటు సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమ్మెకు థియేటర్ల యాజమాన్యం సహకరించలేదు సరికదా టికెట్ల విక్రయం కంప్యూటరైజ్ చేయాలన్న డిమాండ్, ఆన్లైన్ టికెట్ రుసుమును తగ్గించాలి లాంటి విషయాల్లో నిర్మాతల మండలికి, థియేటర్ల సంఘంకు మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సమ్మె కొనసాగుతోంది. అయితే తమిళ చిత్రాలు కొత్తవి విడుదల కాకపోయినా, హింది, ఇంగ్లిష్, తెలుగు, మలయాళం,కన్నడం వంటి ఇతర భాషా చిత్రాలు ముమ్మరంగా తమిళనాడులో విడుదలవుతున్నాయి. దీంతో చాలా వరకు థియేటర్లకు ఫీడింగ్ అయిపోతోంది. కొత్త తమిళ చిత్రాల విడుదల కాకపోయినా థియేటర్ల యాజమాన్యానికి ఆ కొరత పెద్దగా కనిపించడం లేదు. కాబట్టి నిర్మాతల మండలి డిమాండ్లకు వారు దిగి రావడం లేదనే భావన కోలీవుడ్‌లో వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే శుక్రవారం విడుదలైన తెలుగు చిత్రం రంగస్థలం ఒక తమిళ స్టార్ హీరో చిత్రానికి దీటుగా తమిళనాడులో అత్యధిక థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఇది తమిళ నిర్మాతలకు షాక్ కలిగించే పరిస్థితి. దీంతో ఇతర భాషా చిత్రాల విడుదలను అడ్డుకోవాలన్న ఒత్తిడి నిర్మాతలమండలి అధ్యక్షుడు విశాల్‌పై పెరుగుతోంది. దీంతో విశాల్ కూడా ఇతరభాషా నిర్మాతల సంఘాల ప్రతినిధులతో వారి చిత్రాలను తమిళనాడులో విడుదల చేయకుండా తమ సమ్మె మద్దతు పలకాల్సిందిగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరి ఈయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి. -
అలాంటివి చాలా జరిగాయ్!
తమిళసినిమా: నటి లావణ్య త్రిపాఠికి కోపం వచ్చింది. బ్రహ్మన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు నాయకిగా పరిచయమైన ఈ అమ్మడిని ఇక్కడ పెద్దగా పట్టించుకోలేదు. అయితే టాలీవుడ్ మాత్రం మంచి పొజిషన్‌నే లావణ్యకు అందించింది. తాజాగా మయావన్ చిత్రంలో నటించిన ఈ జాణ ఆ చిత్ర విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ లోపే ఆరోపణల్లో ఇరుక్కుంది. ఈ అమ్మడు తెలుగులో మంచి విజయాన్ని సాధించిన 100% లవ్ చిత్ర తమిళ్ రీమేక్‌లో నటించడానికి అంగీకరించి ఆ తరువాత వైదొలిగింది. దీంతో ఆ చిత్ర నిర్మాత లావణ్యపై రూ.3 కోట్లు నష్టం చెల్లించాలంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. దీని గురించి చాలా ఆలస్యంగా రియాక్ట్ అయిన లావణ్యత్రిపాఠి తాను 100% కాదల్ చిత్రం నుంచి వైదొలగిన మాట వాస్తవమేనని అంగీకరించింది. అయితే ఆ చిత్రం విషయంలో నిర్మాతకు తనకు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని, అలాంటి పరిస్థితుల్లో ఆ చిత్రంలో నటించడం సాధ్యం కాదని వైదొలిగినట్లు వివరించింది. అందుకు ఆ చిత్ర నిర్మాత తాను నష్టపరిహారంగా రూ.3 కోట్లు చెల్లించాలని నిర్మాతలమండలిలో ఫిర్యాదు చేసినట్లు వదంతులు ప్రచారం చేస్తున్నారని అంది.అయినా ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయని, అందువల్ల ఈ విషయాన్ని ఇంకా చర్చనీయాంశం చేయడం మంచిది కాదని కాస్త గట్టిగానే చెప్పింది. ఈ విషయంలో తాను మౌనంగా ఉంటున్నానంటే ఏమైనా రాసుకోవచ్చునని అర్థం కాదని, ఆ వదంతి వల్ల తనకెలాంటి నష్టం లేదనే తాను మౌనం వహించానని లావణ్యత్రిపాఠి పేర్కొంది. -
తెలంగాణ రైతులకూ ఇవ్వాలి...
‘‘నిర్మాతల సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన డబ్బులో ఏకంగా పాతిక లక్షల రూపాయలు వైజాగ్ పునర్నిర్మాణం కోసం ప్రకటించి తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి మరోసారి తమ వివక్షను చాటుకుంది’’ అని తెలంగాణ సినిమా నిర్మాతల మండలి అధ్యక్షుడు సానా యాదిరెడ్డి దుయ్యబట్టారు. ‘తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి’ మనది అనే భావనతో ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది తెలంగాణ నిర్మాతలు కౌన్సిల్లో సభ్యులుగా చేరి కోట్లాది రూపాయలు సభ్యత్వ రుసుముగా చెల్లించారన్న యాదిరెడ్డి, ఏనాడూ తెలంగాణకు చెందిన చిన్న నిర్మాతల ప్రయోజనాల విషయంలో నిర్మాతల మండలి శ్రద్ధ చూపించలేదని ఆరోపించారు. తెలంగాణలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల కోసం కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి పాతిక లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 18 కోట్ల కౌన్సిల్ మిగులు నిధుల్ని సభ్యుల అంగీకారం తీసుకోకుండా ఇలా దుర్వినియోగానికి పాల్పడితే సహించేది లేదన్నారు.