సమానత్వం కోసం పోరాడిన యోధుడు బొజ్జతారం
– సంస్మరణ సభలో ప్రొఫెసర్ శేషయ్య
ప్రొద్దుటూరు టౌన్: అన్యాయాలను ప్రశ్నించడానికి హక్కులే ఆయుధాలని, సమానత్వం కోసం జీవిత కాలం పోరాటం చేసిన యోధుడు బొజ్జా తారకం అని ప్రొఫెసర్ శేషయ్య అన్నారు. బొజ్జా తారకం సంస్మరణ సభను పట్టణంలోని శ్రీరాములపేటవీధిలో ఉన్న సీఆర్సీ భవనంలో బుధవారం విరసం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాట్లాడుతూ పీడిత ప్రజల హక్కుల గొంతుగా బొజ్జాతారకం తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఎమర్జన్సీ నేర్పిన నిర్బంధ పాఠశాలలోనే బొజ్జా తారకం పుస్తకం రాశారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా ఉండాలంటే హక్కుల ఉల్లంఘన లేకుండా ఉండటమే ప్రమాణమని వివరించారు. విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి మాట్లాడుతూ బొజ్జా తారకం 1970లో ఏర్పడిన విరసం మొదటి మహాసభలో కార్యవర్గ సభ్యుడన్నారు. కార్యక్రమంలో విరసం కార్యవర్గ సభ్యుడు రవి, సాహితీ వేత్త డాక్టర్ రామచంద్ర, జింకా సుబ్రమణ్యం, కేశవరావు, సుబ్బయ్య, మహమూద్, ఉపాధ్యాయులు, జేవీవీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అనంతపురం విరసం యూనిట్ కన్వీనర్ డాక్టర్ శశికళ అధ్యక్షత వహించారు.