'నేను టీచర్నే.. ప్రీచర్ని కాదు'
న్యూఢిల్లీ: 'నిషేధిత మావోయిస్టు పార్టీకి ఆయన జనరల్ పోస్ట్ ఆఫీస్ (జీపీవో) లాగా పనిచేస్తున్నాడు. ఆయుధాలతో అడవుల్లో తిరిగేవాళ్లకు.. నగరాల్లో ఉంటూ వాళ్లను సమర్థించేవాళ్లకు మధ్య వారధిగా ఉంటున్నాడు' ఇవీ.. ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ జి. సాయిబాబాపై పోలీసులు మోపిన అభియోగాలు. విచారణ ఖైదీగా నాగపూర్ జైలులో దాదాపు ఏడాదిన్నరపాటు దుర్భర కాలాన్ని గడిపిన ఆయన బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం తాత్కాలిక బెయిల్ పై జులై 4న విడుదలయ్యారు. తన అరెస్టు, జైలు జీవితంపై ఆదివారం తొలిసారిగా స్పందించారు.
'పోలీసులు చెబుతున్నట్లు నేను పోస్టాఫీస్ లాంటివాణ్నే అయితే నన్ను అరెస్టు చేయడం దేనికి? ఆ విధంగా మరింత సమాచారాన్ని రాబట్టే అవకాశాన్ని పోలీసులు కోల్పోయినట్లేకదా! ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఒక వ్యక్తి లేదా ఒక గ్రూప్ సాగించే హింస కంటే ప్రభుత్వ హింసే విసృతమైనది. నిజానికి నేను బోధకుడ్ని (టీచర్ను) మాత్రమే. సిద్ధాంతాల ప్రబోధకుడ్ని (ప్రీచర్ ను) కాదు. నాతో చదువుకున్న, నాకు తెలిసిన చాలామంది మావోయిస్టు పార్టీలో చేరారు. వారిలో చాలామంది చనిపోయారు కూడా. ఆ పరిచయాలతోపాటు హక్కుల పోరాటంలో ముందుండటం వల్లే పోలీసులకు నామీద అలాంటి అభిప్రాయం కలిగి ఉండొచ్చు.
నిజానికి నిర్బంధం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించవలసిందే. అణిచివేతకు గురయ్యేది మావోయిస్టులు కానివ్వండి లేదా ఆరెస్సెస్ కానివ్వండి ఎవరి తరఫునైనా పోరాడేందుకు నేను సిద్ధంగా ఉంటా. చర్చలతో సమస్యలు పరిష్కారమవుతాయని నా నమ్మకం. అంతమాత్రాన మావోయిస్టులు, ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించలేను' అని చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ సాయిబాబా. జైలులో తనను ఎవరు కూడా ఎలాంటి శారీరక వేధింపులకు గురిచేయలేదని ఆయన స్పష్టం చేశారు.