‘సారీ’ అంటే ‘సారీ’ అనుకున్నాం
మనోగతం
గోప్యత ఉన్నచోటే...అనుమానం పుడుతుంది. అది పెనుభూతం అవుతుంది. నాకు ఉన్న ఒక అలవాటో దురలవాటో తెలియదుగానీ...ప్రతి విషయాన్నీ గోప్యంగా ఉంచడం. పనిగట్టుకొని ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచాలనేది నా పాలసీ కాదుగానీ... ‘అన్ని విషయాలు అందరితో ఎందుకు చెప్పుకోవాలి?’ అని ఆలోచిస్తుండేవాడిని. వృత్తిరీత్యా నాకు ఎంతోమంది అమ్మాయిలతో పరిచయం ఉంది. వాళ్లతో ఎన్నోసార్లు మాట్లాడుతుంటాను.
అప్పటికి నా పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.
ఒకరోజు రాత్రి నేను ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే-
‘‘ఎవరితో మాట్లాడుతున్నారు?’’ అని అడిగింది మా ఆవిడ.
ఆమె అడిగిన పద్ధతి నాకు నచ్చక దురుసుగా సమాధానం ఇచ్చాను. దీంతో...రెండు రోజుల వరకు మా మధ్య మౌనం!
ఆరోజు ఆవిడే నా దగ్గరకు వచ్చి-
‘‘సారీ’’ అని చెప్పింది.
‘‘నేను కూడా సారీ’’ అన్నాను. ఆరోజు ఎవరితో మాట్లాడానో, ఎందుకు మాట్లాడానో వివరంగా చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మధ్య అపార్థాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. పైగా మాకు తెలిసిన భార్యభర్తలు ఎవరైనా అపార్థాలతో గొడవలు పడుతుంటే మేము వెళ్లి వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చి వస్తుంటాం!
- కె.శంకర్, ఏలూరు