అంగవైకల్యం క్రీడలకు అడ్డు కాదు
సాక్షి, హైదరాబాద్: క్రీడల్లో రాణించేందుకు అంగవైకల్యం అడ్డు కాదని హైదరాబాదీ పారా అథ్లెట్ ఆదిత్య మెహతా చాటి చెబుతున్నాడు. పారా అథ్లెట్లకు సాయమందించేందుకు నిధుల సేకరణకు నడుం బిగించాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రకు గురువారం శ్రీనగర్‌లో శ్రీకారం చుట్టాడు. ‘ఎయిర్టెల్ ఎండ్యురెన్స్ రైడ్’ పేరిట 36 రోజుల పాటు 3800 కిలోమీటర్లు పయనించనున్నాడు.
ఇందులో భాగంగా 8 రాష్ట్రాల్లో 36 నగరాలను అతను చుట్టి వస్తాడు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిత్య రెండుకాళ్లను కోల్పోయాడు. అంతటితో తన జీవితం ముగిసిపోలేదని, వైకల్యాన్ని జయించి కలల్ని సాకారం చేసుకుంటాననే ధైర్యంతో ముందడుగు వేశాడు. కృత్రిమ కాలు పరికరంతో సైక్లింగ్ క్రీడను ఎంచుకున్నాడు.
కేవలం 19 నెలల వ్యవధిలోనే 31 ఏళ్ల ఆదిత్య ప్రొఫెషనల్ సైక్లిస్ట్‌గా ఎదిగాడు. ఈ ఏడాది జరిగిన పారా ఆసియా సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు రజత పతకాలు గెలుపొందాడు. తనలాంటి అంగవికలురు నిరాశలో కూరుకుపోకుండా, భవిష్యత్తుపై ఆశలు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఎండ్యురెన్స్ రైడ్‌ను ప్రారంభించాడు. దీనికి కార్పొరేట్ సంస్థలు కూడా స్పాన్సర్‌గా వ్యవహరించడంతో యాత్ర ఆరంభించాడు. దీని ద్వారా వచ్చిన నిధుల్ని పారా అథ్లెట్ల కోసం వినియోగించనున్నాడు. ‘భారత్ గొప్ప దేశం. ఇక్కడ ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. కొందరు అంగవైకల్యంతో అంతా కోల్పోయామని భావిస్తుంటారు. అలాంటి వారూ రాణించవచ్చనే సందేశంతో ఈ యాత్ర చేస్తున్నాను’ అని ఆదిత్య పేర్కొన్నాడు.