అనకాపల్లికి మరో వరం
అనకాపల్లి, న్యూస్‌లైన్: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో అగ్రి ఇంజినీరింగ్ డిప్లొమో కళాశాలను ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పరిశోధన స్థానంలోని ఏడీఆర్ చాంబర్లో ఆయన అగ్రి ఇంజినీరింగ్ కళాశాల విధి విధానాలపై శాస్త్రవేత్తలతో చర్చించారు. విశ్వవిద్యాలయం బోర్డు మెంబర్లు కళాశాల ఏర్పాటుకు అనుమతిస్తూ తీర్మానం చేసినట్టు ఏడీఆర్ అంకయ్య మంత్రికి తెలియజేశారు.
ఈ సందర్భంగా వెబ్ కౌన్సెలింగ్ జరిగే తీరును, అగ్రి ఇంజినీరింగ్ కళాశాల ప్రాధాన్యాన్ని, సీట్ల సంఖ్యకు సంబంధించిన వివరాలను మంత్రి తెలుసుకున్నారు. ఏడాదికి 30 సీట్లు భర్తీ అయ్యే అగ్రి ఇంజినీరింగ్ కళాశాలకు అవసరమైన భవనం, ఫర్నిచర్ కోసం కనీసం రెండుకోట్లు కావాలని మంత్రిని ఏడీఆర్ కోరారు. సిబ్బంది నియామకానికి కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ సిబ్బంది ఎందరు అవసరమో, నిధులెన్ని కావాలో కచ్చితంగా చెబితే అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.
కళాశాలను ప్రస్తుతానికి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలోని భవనాలలో నిర్వహిస్తామని, ఇద్దరు ప్రొఫెసర్లను తాత్కాలిక ప్రాతిపదికన తీసుకోవచ్చని ఏడీఆర్ అంకయ్య తెలిపారు. కళాశాల గురించి ఏడీఆర్ అంకయ్యతో పాటు చెరకు ప్రధాన శాస్త్రవేత్త కె. ప్రసాదరావు, నైర కళాశాల ప్రొఫెసర్ పి. జగన్నాధరావు వివరించారు. ఈ కార్యక్రమాల్లో ఏడీఏ శ్రీదేవి, శాస్త్రవేత్తలు వీరభద్రరావు, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల సూపరింటిండెంట్ రామకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, కాంగ్రెస్ నాయకులు దంతులూరి దిలీప్‌కుమార్, కడిమిశెట్టి రాంజీ, బాబి తదితరులు పాల్గొన్నారు.
భవనాలను పరిశీలించిన గంటా
ఏడీఆర్ ఛాంబర్లో అగ్రి ఇంజినీరింగ్ కళాశాల వ్యవహారంపై సమీక్ష జరిపిన తర్వాత, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను, అక్కడి సదుపాయాలను మంత్రి పర్యవేక్షించారు. తాత్కాలిక ప్రాతిపదికన సదుపాయాలు కల్పించుకుంటే తర్వాత నిధులు అందుబాటులోకి తేవడానికి, సిబ్బందిని నియమించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మూడేళ్ల కాలపరిమితి గల కోర్సులు
డిప్లమో ఇన్ అగ్రి ఇంజినీరింగ్ కళాశాలలో మూడు సంవత్సరాల కాలపరిమితితో కోర్సు ఉంటుంది. ఏడాదికి 30 సీట్లను భర్తీ చేస్తారు. గత ఏడాదే డిప్లమో ఇన్ అగ్రి ఇంజినీరింగ్ కళాశాలను రాజేంద్రనగర్‌లో ప్రారంభించగా, రెండోదానిని చిత్తూరు జిల్లాలోని కలికిరిలో ఏర్పాటు చేశారు. పదో తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులు. ఈ కోర్సు పూర్తి చేసినవారు బీటెక్ అగ్రి బ్రాంచ్‌లో రెండో సంవత్సరం నేరుగా ప్రవేశించే వెసులుబాటు ఉంది.