భర్తీ ఆన్లైన్లోనే..
♦ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటాపై ఉన్నత విద్యామండలి
♦ సాక్షి కథనంపై స్పందన..
♦ ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి తెస్తాం
♦ అఫిలియేషన్లు ఇంకా రాలేదు.. ఎన్ని వస్తాయో తెలియదు
♦ కన్వీనర్ నోటిఫికేషన్ తర్వాతే మేనేజ్మెంట్ కోటా భర్తీ: పాపిరెడ్డి
♦ ముందుగా డబ్బులు కట్టి ఇబ్బందుల్లో పడొద్దని తల్లిదండ్రులకు సూచన
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. 2017–18 విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్ విధానం అమల్లోకి తెస్తామని చెప్పారు. ‘సీటుకో రేటు.. అడ్గగోలుగా ఇంజనీరింగ్ సీట్ల అమ్మకాలు’శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఉన్నత విద్యా మండలి స్పందించింది.
కాలేజీ యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటా సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకోవడానికి వీల్లేదని, అలాంటి కాలేజీలపై చర్యలు తప్పవని çఆయన స్పష్టం చేశారు. ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. అది పూర్తయ్యాక అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా, సీట్ల వివరాలు తమకు అందుతాయన్నారు. అనంతరం సీట్ల భర్తీకి కన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేస్తారని చెప్పారు.
అప్పటివరకు యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ చేయొద్దని స్పష్టంచేశారు. తల్లిదండ్రులు కూడా అప్పటివరకు మేనేజ్మెంట్ కోటా సీట్లలో తమ పిల్లలను చేర్చవద్దని సూచించారు. తాము ఆన్లైన్ భర్తీ విధానం అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నందున వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ‘‘అనాలోచితంగా ఇప్పుడే మేనేజ్మెంట్ కోటా సీట్లలో చేరితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఎన్ని కాలేజీలకు అనుబంధ గుర్తింపు వస్తుందో.. ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు. ముందుగానే డబ్బులు కట్టి తల్లిదండ్రులు ఇబ్బందులు పడవద్దు. ఏవైనా కాలేజీ యాజమాన్యాలు సీట్లు అమ్ముకుంటున్నట్లు తల్లిదండ్రులకు తెలిస్తే.. మాకు ఫిర్యాదు చేయాలి. అలాంటి కాలేజీలపై కఠిన చర్యలు చేపడతాం’’ అని ఆయన స్పష్టం చేశారు.