నిరసనలు.. నిలదీతలు
శ్రీకాకుళం టౌన్: జన్మభూమి-మాఊరు కార్యక్రమం నిరసనలు..నిలదీతలకు వేదికగా మారుతోంది. రేషన్‌కార్డులు, పింఛన్లు తదితర ప్రభుత్వ పథకాలపై అర్హులు నిలదీస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జన్మభూమి కమిటీ సభ్యుల ఏకపక్ష నిర్ణయాలను జీర్ణించుకోలేక సొంతపార్టీ కేడర్ సైతం గ్రామసభల్లో ఎదురు తిరుగుతున్నారు. జిల్లాలో ఐదురోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రశాంతంగా ఉండే పల్లెలు వర్గవిభేదాలతో వేడెక్కుతున్నాయి.
జలుమూరు మండలం టి.లింగాలపేటలో ప్రత్యేకాధికారి ఎం.వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో జన్మభూమి-మా ఊరు గ్రామసభ నిర్వహించారు. ప్రభుత్వ పథకాల్లో వివక్ష చూపుతున్నారంటూ ఎంపీటీసీ ప్రతినిధి వాన నాగేశ్వరరావు అధికారులను ప్రశ్నించారు. దీంతో జన్మభూమి కమిటీసభ్యులు అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్యతోపులాట జరిగింది.
టెక్కలి మండలం తలగాంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామంలో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నారంటూ వైఎస్ఆర్ సీపీ నాయకులు గ్రామసభలో అధికార్లను నిలదీశారు. దీంతో జన్మభూమి కమిటీ, టీడీపీ నాయకులు వైఎస్ఆర్ సీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. కంచిలి, వజ్రపుకొత్తూరు, పొందూరు, సంతకవిటి ప్రాంతాల్లోనూ జన్మభూమి గ్రామసభలు వాడీవేడిగా సాగాయి.
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 14,15 వార్డుల్లో నిర్వహించిన గ్రామసభకు వైఎస్ఆర్ సీపీ నాయకుడు దువ్వాడ శ్రీకాంత్ హాజరై ప్రజల సమస్యలను ప్రస్తావించారు. వేదిక పైకి రావాలంటూ పిలిచినా వెళ్లకుండా ప్రజల మధ్యే కూర్చున్న దువ్వాడ పేదలకు అందాల్సినపథకాలు పక్కదారిపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ కౌన్సిలర్ పైల చక్రధర్ అనుచరులకు, దువ్వాడకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.