'సొమ్ము మింగిన' కాంట్రాక్టర్లు జైలుకే: దానం
కాంట్రాక్టర్లపై రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ మంగళవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లే భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్‌లలో అంచనా వ్యయాలను అడ్డగోలుగా పెంచడానికి ఎలా అంగీకరించారని ఆయన ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును దొడ్డి దారిన కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ సొమ్మును దిగమింగిన కాంట్రాక్టర్లు త్వరలో జైల్లో ఉంటారని హెచ్చరించారు. మాజీ మంత్రులు సబిత, ధర్మాన ప్రసాద రావులు చేయని తప్పులకు నిందలు పడ్డారని దానం అభిప్రాయపడ్డారు. అంచనాలు పెంచడం వల్ల ప్రాణహిత చేవెళ్లకు జరిగింది శూన్యమన్నారు. హంద్రినీవాకు మాత్రం 8 స్టేజ్లని అన్నారని అయితే ఇప్పటికి 34 స్టేజ్‌లకు వచ్చిందన్నారు. ట్రైబ్యునల్ ప్రకారం 15 టీఎంసీల నీటీని హైదరాబాద్‌కు తరలించాలని ప్రతిపాదనలు ఉన్నా ప్రభుత్వం ఎక్కడా పేర్కొన్నలేదని దానం నాగేందర్ తెలిపారు.