పులిచింతల వద్ద తగ్గిన వరద ఉధృతి
మేళ్లచెరువు, న్యూస్‌లైన్ : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి దిగువ కృష్ణా నదిలోకి నీటి విడుదల నిలిపివేయడంతో పులిచింతల ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్ట్ క్రస్ట్ లెవల్ పైనుంచి 5 అడుగుల ఎత్తులో వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. ప్రాజెక్ట్ 14 క్రస్ట్‌గేట్లను ఎత్తి దాదాపు 30 వేల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజ్‌కు వదులుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా నిర్మిస్తున్న విద్యుదుత్పత్తి ప్లాంటు కూడా వరద నీటిలో మునిగే ఉంది. ఎగువ కృష్ణా నది నుంచి వరద నీరు నెమ్మదిగా వచ్చి చేరడంతో ప్రాజెక్ట్ వద్ద నీరు ప్రశాంతంగా పారుతోంది. ప్రాజెక్ట్‌పైన బ్రిడ్జి, గేట్ల పైభాగంలో సివిల్, మెకానికల్ పనులు కొనసాగుతున్నాయి.
అడ్లూరును వదలిన వరద నీరు
అడ్లూరు గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీరు వెనక్కు తగ్గింది. దీంతో గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వరద ఉధృతికి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారిపై నుంచి వరద నీరు 4 అడుగుల ఎత్తులో ప్రవహించిన కృష్ణమ్మ వెనక్కు తగ్గింది. దీంతో గ్రామంలోకి రాకపోకలకు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా అడ్లూరు, చింత్రియాల, కిష్టాపురం, వెల్లటూరు శివారులోని పొలాల్లోకి చేరిన నీరు కూడా తగ్గడంతో రైతులు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి కృష్ణానది వల్ల ప్రమాదం తప్పిపోయినట్లేనని ముంపు గ్రామస్తులు పేర్కొంటున్నారు.