ఎంపీ రవీంద్రనాథ్ ఆస్తుల అటాచ్
సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరు సెల్వం వారసుడు, ఎంపీ రవీంద్రనాథ్‌కు సంబంధించి రూ. 10 కోట్ల ఆస్తిని అటాచ్ చేస్తూ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఇటీవల చైన్నెలో చేపట్టిన దాడుల్లో లభించిన సమాచారం ఆధారంగా ప్రస్తుతం అఽధికారులు చర్యలు విస్తృతం చేశారు. శనివారం సీఎం స్టాలిన్ కోడలు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ సతీమణి కృతికకు చెందిన రూ. 36 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ పరిస్థితుల్లో కల్లాల్ గ్రూప్ నుంచి సేకరించిన ఆధారాల మేరకు పన్నీరు సెల్వం వారసుడు , ఎంపీ రవీంద్రనాథ్‌కు సంబంధించిన సాయిరాం ట్రస్టుకు రూ. 8.5 కోట్లు నగదు బదిలీ జరిగి ఉండటాన్ని ఈడీ గుర్తించింది. ఈ మొత్తాన్ని రవీంద్రనాథ్ తక్షణం బ్యాంక్ నుంచి డ్రా చేసి ఉండటంతో ఆయన్ని కూడా విచారణ వలయంలోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఆయనకు సంబంధించిన రూ. 10 కోట్లు విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, లైకా సంస్థకు చెందిన అధికారి జీకే ఎం కుమార్‌కు చెందిన టీ నగర్‌లోని రూ. 15 కోట్లు విలువైన ఇంటిని కూడా అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.