అవినీతిలో ‘బ్రేక్’
ఏసీబీ వలలో డీటీసీ కార్యాలయ ఇన్స్పెక్టర్ అప్పారావు
రూ.కోట్లాది విలువైన ఆస్తులు స్వాధీనం
కాకినాడ రూరల్ :
కాకినాడ రవాణా శాఖ (జిల్లా ట్రాన్‌పోర్ట్ కార్యాలయం) కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందనడానికి ఏసీబీ దాడులే ప్రత్యక్ష నిదర్శనంగా మారాయి. నాలుగు నెలలు తిరక్కుండానే ఏసీబీ వలలో భారీ అవినీతికి పాల్పడిన వెహికల్ ఇన్స్పెక్టర్ రావు అప్పారావు చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంలో బుధవారం ఏసీబీ అధికారుల బృందం.. అప్పారావు, అతడి బంధువులు, స్నేహితుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.లక్ష నగదు, వ్యవసాయ భూముల పత్రాలు, కాకినాడ, పరిసర ప్రాంతాల్లో భవనాలు, ఖాళీ స్థలాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. గత మే నెలలో ఇదే కార్యాలయానికి చెందిన డీటీసీ ఆదిమూలం మోహన్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేసి, రూ.కోట్లాది విలువైన ఆస్తులను సీజ్ చేశారు. తాజా సంఘటనతో రవాణా శాఖాధికారి కార్యాలయ సిబ్బంది, అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాఉంటే బుధవారం రవాణా శాఖ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ రావు అప్పారావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో దుర్గా విద్యుత్‌నగర్‌లోని ఆయన నివాసంతో పాటు రమణయ్యపేట, అనపర్తి, నాగమల్లితోట జంక్షన్, రమణయ్యపేటల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆరు చోట్ల దాడులు నిర్వహించి, రూ.కోట్లాది ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.20 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నాగమల్లితోట జంక్షన్ సమీపంలో అప్పారావు డ్రైవర్ శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేయగా, భారీగా భూముల పత్రాలు లభ్యమయ్యాయి. రామారావు స్నేహితుడైన బొడ్డు రామారావు ఇంటి నుంచి రూ.కోట్లాది విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పది ఎకరాల పొలం, రమణయ్యపేట, తిమ్మాపురం, కాకినాడ, వాకలపూడి ప్రాంతాల్లో 3,500 గజాల స్థలాల డాక్యుమెంట్లు, కారు, పలు భవనాల పత్రాలు బయటపడ్డాయి. బొడ్డు రామారావు కోటేశ్వరుడైనా అతడికి తెల్లరేషన్ కార్డు, అతడి భార్య పేరిట కారు ఉందని ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు తెలిపారు.
వడ్డీ వ్యాపారం కూడా..
నాగమల్లితోట జంక్షన్‌లోని సత్యనారాయణ అనే మరో స్నేహితుని ఇంట్లో కూడా భారీగా ఆస్తుల పత్రాలు లభ్యమయ్యాయి. ఇతడితో రూ.కోట్లలో వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. తుని, రౌతులపూడిల్లో భూములున్నట్టు అధికారులు కనుగొన్నారు. బొడ్డు రామారావు రూ.80 లక్షలకు పైగా వడ్డీకి ఇచ్చినట్టు ప్రామిసరీ నోట్లు, వాటి వివరాలు వెలుగుచూశాయి. బిక్కవోలు మండలం రామవరంలో రామారావు బావమరిది చిర్ల లక్ష్మణరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. గత 18 ఏళ్లుగా అప్పారావు కాకినాడ కార్యాలయంలోనే ఉండడమే కాకుండా, కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు వివరించారు. గురువారం దాడులు కొనసాగుతాయని, మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందన్నారు. బ్యాంకు లాకర్లు కూడా తెరవాల్సి ఉందన్నారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, సూర్యమోహనరావు, రమేష్, రామకృష్ణ, లక్మోజీ, శ్రీనివాస్, విల్సన్ పాల్గొన్నారు.