ప్రభు రక్షణలో...
దేవుడు ప్రేమాస్వరూపి (1 యోహాను 4:8). దేవుడు చేసిన సృష్టిని చూసినా, మనిషిని సృష్టించి అతనికిచ్చిన ప్రాధాన్యాన్ని చూసినా ఆశ్చర్యమనిపిస్తుంది.‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగాఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’’ (యోహాను 3:16). ‘‘ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు’’ (అపొ.కా. 16:31). ఇది యేసు సువార్త. అందరికీ శుభవార్త. మొదట ఆదాము, అవ్వల అవిధేయత వల్ల మానవ జాతి పాపంలో చిక్కుబడిపోయింది. తండ్రి చెప్పినమాట ‘‘మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు’’ (ఆది 2:17). కానీ, వారు ఆపుకోలేక, మాటను అతిక్రమించి పాపం చేశారు.
ఈ లోకానికి మరణాన్ని తెచ్చారు. దేవునికి దూరమయ్యారు. అయితే తండ్రి ప్రేమను చంపుకోలేక ప్రాయశ్చిత్తంగా గొఱె< పిల్లను వధించి ఆదాముకు, అతని భార్యకు చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించినట్లుగా చూస్తున్నాం. వారు ఆత్మీయంగా చనిపోయి తండ్రి సహవాసానికి దూరమయ్యారు. పాపం విస్తరించింది. అందుకే పాత నిబంధన కాలంలో ప్రతి ఏటా వారి పాపప్రక్షాళన కొరకు నిర్దోషమైనది, నిష్కళంకమైనది – అది ఎద్దు గాని, గొఱె< గాని, పక్షిజాతిలో తెల్ల గువ్వ గాని, పావురం గాని వధించి, దాని తల మీద చెయ్యి పెట్టి, వారి పాపం వాటిలోకి పోవడం, వారు నిర్దోషులవడం ఆనవాయితీగా ఉండేది. ఈ దహనబలి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానిదే. ఇది యెహోవాకు ఇంపైన హోమం.
క్రొత్త నిబంధన కాలంలో యేసయ్య సిలువ మీద అర్పణ దహనబలి ‘‘క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను, దహనబలిగాను అప్పగించుకొనెను.’’ యేసయ్య నీలో నాలో ఉన్నాడు. నీ శరీరమే ఒక ఆలయం. నీవు, నేను ఆయన విలువ పెట్టి కొనబడినవారము. నీవు... నీవు కావు, నీవు ఆయన సొత్తు. ఆయన మహిమ నీకు, నాకు ఇచ్చాడు. ఆయన వధింపబడిన గొఱె<పిల్ల. శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడు నీలో, నాలో ఉన్నాడు. ఆయన లేఖన్లాల్లో ఉన్నవన్నీ మన సొంతం’’(ప్రకటన 5:12).
ప్రతి ఒక్కరికీ మరణం వచ్చింది. పాపం పెరిగిపోయింది. అయితే దేవుడు తన ప్రేమను చంపుకోలేక మనల్ని పాపం నుండి తప్పించడానికి రక్షకుణ్ణి ఏర్పాటు చేశాడు. ఆయనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. యేసయ్య మరణ, పునరుత్థానాల ద్వారా అందించబడిన ఉచితమైన రక్షణను అంగీకరించిన ప్రతి ఒక్కరూ పాపము యొక్క పట్టు నుండి, దాని ద్వారా కలుగబోయే మరణ శిక్ష నుండి తప్పింపబడుతారు. ‘ఎందుకంటే’ ‘‘మనమింకను పాపులమై ఉండగానే మన కోసం యేసయ్య చనిపోయాడు’’ (రోమా 5:8). ఆయన రక్తం ద్వారా దేవునితో సమాధానపరచబడిన వారమై, రక్షణను పొందుతున్నవారం. అందుకే పౌలు అంటున్నాడు... ‘‘యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచువాడెవడునూ సిగ్గుపడడు’’ (రోమా 10:9–11). ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడు వారిని (నిన్న, నేడు యుగయుగాలకు) సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు (హెబ్రీ 10:14).
పాపాములతో, అపరా«ధములతో చచ్చినవంటి వారిని ఆయన ప్రేమతోనే క్రీస్తుతో కూడ బతికించెను. విశ్వాసం, కృప చేత రక్షించబడియున్నాము. యేసయ్య తన రెండు చేతులు చాచి నిన్ను, నన్ను పిలుస్తున్నాడు. ‘‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును’’ (మత్తయి 11:28). అంతేకాకుండా నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను’’ (యోహాను 6:38). యేసయ్య సిలువ త్యాగం మనకర్థమైతే మనం ఆయన దగ్గరకు పోయి, ఆయన చేతుల్లో ఇమిడిపోయి, ఆయన కౌగిట్లో ఆయన హృదయాన్ని హత్తుకొని నిశ్చింతగా బతుకుతాం. ఎందుకంటే మనం ఎవ్వరమూ అందుకు అర్హులం కాదు. మనం ఎంతటి ఘోర పాపులమైనా ఆయన దగ్గరికి పోదాం. ఎందుకంటే ‘‘నశించిన దానిని వెదికి, రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను’’ (లూకా 19:10).
మనం కష్టాలలో, బాధలలో ఉంటే – యేసయ్య సిలువను నిశితంగా చూస్తూ ఉంటే నీ కోసం, నా కోసం ఆయన చూపించిన ప్రేమ కనిపిస్తుంది. దేవుడు కోరుకుంటున్నాడు... యేసయ్య గురించి, ఆయన సిలువ మీద మన కోసం చేసిన త్యాగం గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే రక్షణ లేదు. ఆయన వచ్చిన దానికి సార్థకత లేదు. ఎవరైతే యేసురక్తం కిందకు వస్తారో వారందరూ రక్షింపబడతారు. విడుదల పొందుతారు. ఆయన శరీరం వల్ల స్వస్థత పొందుతారు. దేవుడు కోరుకుంటున్నాడు... ఆయన కృపలో తన బిడ్డలు సంతోష సమాధానాలతో బతుకులు కొనసాగించాలని. ఇతరుల జీవితాలను వెలిగించేవారముగా ఈ లోకానికి ఒక సాక్ష్యంగా ఉండాలనుకుంటున్నాడు.
మనకు ఎంత ఎక్కువగా ఆయన ప్రేమ, ఆయన సిలువ త్యాగం అర్థమైతే అన్ని ఆశీర్వాదాలు మనతో ఉంటాయి. అవి స్వస్థత, రక్షణ. పాపక్షమాపణ, కాపుదల, ఐశ్వర్యం, నిత్యజీవం. శాంతి సమాధానం, ఆయన నీతి, పరిశుద్ధత, సంపూర్ణత, దేవుని సన్నిధి, విజయం, ఘనత, ఆయన మహిమ, ఆయన శక్తి, ప్రేమ, ఆయన జ్ఞానం సమస్తం మన సొంతం.
యేసయ్య నీవు నన్ను కోరుకున్నావు. నన్ను ఏర్పరచుకున్నావు. నీ అరచేతులతో చెక్కుకున్నావు. నీ గాయపడిన హస్తాలలో భద్రపరుస్తున్నావు. నీ కృపతో నన్ను ఆవరించియున్నావు. నన్ను ‘ముదిమి వచ్చువరకు చంకనెత్తుకుంటాను’ అన్నావు. నీ నామం నాకు రక్షణ ఇచ్చింది. నీ వాక్యం నన్ను పరిశుద్ధపరిచింది. నీ రక్తం నన్ను కడిగింది. నీ రాజ్యంలో నాకు స్థానం ఇచ్చావు. నీ ఆత్మ నన్ను స్థిరపరచినది. ఎంతగా అంటే ఈ లోకంలో అందరూ విడిచిపోయేవారు అయితే నీవు నన్ను విడవవు, ఎడబాయవు. నేను మరిచినా నీవు మరువవు. ఎంతగా అంటే తల్లి మరిచినా నేను నిన్ను మరవను అన్నావు. అంతేకాదు. నీవు నా కనుపాపవి అన్నాడు. కోడి తన రెక్కల కింద పిల్లలను దాచినట్లు ఎప్పుడూ నీ రెక్కల కింద దాచువాడవు నీవే!
నీ ప్రేమను ఏమని చెప్పేది? నేను పిలిస్తే పరుగున వచ్చేస్తావు. నేను ప్రార్థన చేస్తే ఆలకిస్తావు. నేను ఏడిస్తే, లాలించి తల్లిలా ఓదారుస్తావు, తండ్రిలా ప్రేమిస్తావు. ఎంత గొప్ప ప్రేమ నా యేసయ్యది!నేను అలసిపోతే నీ చేతిని అందిస్తావు. నేను పడిపోతే నీవు ఎత్తుకొని, నీ గుండెలకు హత్తుకుంటావు. నా ప్రతి పరిస్థితిలో నీవుంటావు. కష్టంలో, బాధలో, సంతోషంలో నీ కరుణతో నన్ను నడిపిస్తావు.యేసు వైపు చూస్తూ, మన సాక్ష్యంలో యేసును చూపిస్తూ, ఆయనకు మహిమకరంగా జీవిస్తూ, ఆయన కౌగిలిలో ఒదుగుతూ ముందుకు సాగిపోదాం.
వై.ఎస్. విజయమ్మ