కిడ్నీ వ్యాధుల్ని ప్రేరేపించే ప్రోటీన్!
న్యూయార్క్: నేటి కాలంలో కిడ్నీ (మూత్ర పిండాలు) సంబంధిత వ్యాధులు అధికమయ్యాయి. పెద్దవయసు వారు ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలపై అధ్యయనం చేసే పరిశోధకులు కిడ్నీ వ్యాధులను ఓ ప్రోటీన్ ప్రేరేపిస్తుందని గుర్తించారు. మానవ శరీరంలో ఉండే ఆర్టీఎన్1 అనే జన్యువు సగటు స్థాయికన్నా ఎక్కువైతే, అది రెటిక్యులాన్ అనే ప్రోటీన్‌ను అధిక స్థాయిలో విడుదల చేస్తుంది. ఈ ప్రోటీన్ పరిమితికి మించి ఉంటే అది తీవ్రమైన కిడ్నీ వ్యాధులను కలిగిస్తుందని అమెరికాకు చెందిన ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుడు జాన్ సిజియాంగ్ తెలిపాడు. ఈ ప్రోటీన్ కిడ్నీలోని కణజాలాలను ధ్వంసం చేసే చర్యలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా కిడ్నీలు పాడై పోతాయని జాన్ బృందం జరిపిన అధ్యయనంలో తేలింది. ఏ జన్యువులు, ప్రోటీన్లు ఎక్కువగా, లేదా తక్కువగా ఉంటే కిడ్నీ వ్యాధులు సంభవిస్తాయి అనే అంశంపై ఈ బృందం ఎలుకలపై అధ్యయనం జరిపింది. ఆర్టీఎన్1 సహా పలు జన్యువులు మూత్ర నాళ వ్యాధులకు కారణమవుతాయని దీనిద్వారా కనుగొన్నారు.
రెటిక్యులాన్ ప్రోటీన్ ఎక్కువైతే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది. ఈ విషయాన్ని కనుగొనడం ద్వారా ఈ వ్యాధుల నివారణకు సరైన మందులు, చికిత్సా విధానాన్ని కనుగొనే వీలుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. నేటి కాలంలో కిడ్నీ వ్యాధులు వస్తే కొన్ని సార్లు కిడ్నీల మార్పిడి, లేదా డయాలసిస్ చేయాల్సి వస్తుంది. పూర్తి స్థాయి చికిత్స అందుబాటులోకి వస్తే ఈ ఇబ్బందులు తీరే వీలుంది.