మెళకువలు పాటిస్తేనే అధిక దిగుబడి
♦ పశువులకు మాంసకృత్తులు, విటమిన్లు
♦ సమపాళ్లలో అందించాలి
♦ రైతులకు పశువైద్యురాలు
♦ దుర్గా రమాదేవి సూచనలు
మిర్యాలగూడ రూరల్ : పశువులకు తమ దైనందిన కార్యక్రమాల నిర్వహణకు కావాల్సిన శక్తి కోసం, శరీరాభివృద్ధికి, పునరుత్పాదకశక్తికి మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వు లవణాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు, నీరు చాలా అవసరం ఉంటుంది. రైతులు మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని మిర్యాలగూడ మండలం తుంగపహాడ్ పశు వైద్యురాలు దుర్గరమాదేవి పేర్కొంటున్నారు. ఈ విషయంపై రైతులు తీసుకోవాల్సిన సలహాలను వివరించారు.
మాంసకృత్తులు..
శరీర పెరుగుదలకు, వ్యాధి నిరోధక శక్తి, హిమోగ్లోబిన్ నివారణకు తోడ్పడతాయి. శరీరానికి శక్తిని అందజేస్తాయి. పెయ్యలు, పడ్డల ఎదుగుదలకు, పాడిపశువుల్లో పాడి దిగుబడికి దోహదపడతాయి. మాంసకృత్తులు ఆహారంలో లోపిస్తే పశువులు చిక్కిపోవడం, పెరుగుదల స్తంభించడం, అండాశయాలు చిన్నగా ఉండడం, ఆలస్యంగా యుక్త వయసుకు రావడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, కండరాల బలహీనత వంటి సమస్యలు ఏర్పడతాయి. పత్తి గింజలు, వేరుశనగ పిండి, కొబ్బరి పిండి, నువ్వుల పొడి, చేపల, మాంస పొడి వంటి ముడిపదార్థాల్లో, పప్పు జాతికి చెందిన పశుగ్రాసాల్లో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి.
పిండి పదార్థాలతో 50 శాతం శక్తి
పశువుల్లో రోజువారి కార్యక్రమా ల నిర్వహణకు కావాల్సిన శక్తిలో 50 శాతం పిండి పదార్థాల ద్వారా లభి స్తుంది. ఒకగ్రాము పిండి పదార్థాలు నాలుగు కిలో ల క్యాలరీల శక్తిని అందజేస్తుంది. పిండిపదార్థాలు తక్కువైతే కొవ్వుగా మారి పశువుల స్థూలకాయానికి దారితీస్తుంది. పిండి పదా ర్థాలు సరిపోను లభ్యంకాకపోతే పశువుల శరీరాభివృద్ధి, ఉత్పాదక సామర్థ్యం దెబ్బతిని శరీర బరువు తగ్గి నీరపడిపోతాయి. మొక్కజొన్న, జొన్న, నూకలు, సజ్జల వంటి ధాన్యాలు, చెరుకు మడ్డి, ఎండు మేతలు, చొప్ప ధాన్యం జాతి పశుగ్రాసాల్లో పిండి పదార్థాలు లభిస్తాయి.
కొవ్వు పదార్థాలు
ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని కొంత వరకు అందజేస్తాయి. విటమిన్ ‘ఏ’ శరీరంలో సక్రమంగా వినియోగపడేందుకు దోహదపడతాయి. శరీరంలో అంతర్గత కొవ్వు నిల్వలు దెబ్బలనుంచి అంతర్గత అవయవాలను రక్షిస్తాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి. ఆహారంలో రుచిని పెం పొందిస్తాయి. పశువుల కృత్తిమ పునరుత్పత్తిలో మాంసకృత్తుల కంటే కొవ్వు అం దించే శక్తి అధికంగా ఉంటుంది. ఒక గ్రాము కొవ్వు పదార్థం 9 కిలో క్యాలరీల ఉష్ణ శక్తిని విడుదల చేస్తుంది. వేరుశనగపిండి, బొబ్బరి పిండి, నూనె గింజల చక్క, గోధుమ, వరి తౌడు లాంటి పదార్థాల్లో కొవ్వు అధికంగా ఉంటుంది.
జీవక్రియలకు నీరు దోహదం
మేత లేకుండా పశువు మూడు నెలలు బతుకుతుంది గానీ.. నీరు లేకుండా ఐదు రోజుల పాటు బతుకలేదు. నీరు శరీర జీవ క్రియలకు, ఉత్పాదకతకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. నీరు శరీరంలో వివిధ పోషక పదార్థాలు సంగ్రహించడానికి, పోషక పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరంలో వివిధ భాగాలకు చేర్చడానికి, శారీరక ఊష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, శ్వాసక్రియ కొనసాగించడానికి చర్మం సాగే గుణం ఉండడానికి, జీర్ణక్రియలో ఉపయోగపడే కొన్ని ఎంజైముల తయారీకి, వ్యర్థ పదార్థాలను విసర్జించడానికి నీరు దోహదపడుతుంది. పాలల్లో 90 శాతం నీరు ఉంటుంది. సాధారణంగా పచ్చి మేతలో 70 శాతం, ఎండు మేతలో 10 శాతం నీరు ఉంటుంది. ఈ మేత తినడం ద్వారా కొంత నీరు లభిస్తుంది. శరీరంలో నీరు తక్కువ అయితే పొడిగా మారడం, మూత్ర సంబంధ వ్యాధులు, అజీర్తి, మలబద్దకం వంటి వ్యాధి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. పశువులు ఢీహైడేరషన్కు గురై మరణిస్తాయి. కాబట్టి పశువులకు నీరు కూడా పశు పోషణలో అత్యవసరమైన పోషక పదార్థంగా గుర్తించాలి. పశువుకు రోజుకు 50 నుంచి 60 లీటర్ల నీరు అవసరం.