రోజంతా టీడీపీ నిరసన
12 గంటలు స్పీకర్ చాంబర్లో ఎమ్మెల్యేల బైఠాయింపు
పార్టీ ఫిరాయింపులు, తలసాని రాజీనామాపై స్పష్టతకు డిమాండ్
తననెవరూ శాసించలేరంటూ వెళ్లిపోయిన స్పీకర్
సభ వాయిదా పడ్డాక నాటకీయ పరిణామాలు
రాత్రంతా చాంబర్లోనే నిద్రించేందుకు ఎమ్మెల్యేల యత్నం
రాత్రి 9 దాటాక ఎన్టీఆర్ భవన్‌కు తరలించిన పోలీసులు
అసెంబ్లీ వీళ ్లఅయ్య తాతల జాగీరా: ఎర్రబెల్లి ఆగ్రహం
25 ఏళ్లలో ఇలాంటి స్పీకర్‌ను ఎన్నడూ చూడలేదని వ్యాఖ్య
నేడు మరోసారి గవర్నర్‌ను కలవాలని నిర్ణయం
హైదరాబాద్: అసంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన టీడీపీ ఎమ్మెల్యేలు మంగళవారం స్పీకర్ చాంబర్ వద్ద చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష చివరకు భగ్నమైంది. ఉదయం 9.15 గంట లకు వారు అసెంబ్లీలోని స్పీకర్ మధుసూదనాచారి చాంబర్‌కు చేరుకుని హల్చల్ చేశారు. రాత్రి 9గంటల వరకూ అక్కడే బైఠాయించారు. స్పీకర్ వెళ్లిపోయినా నిరసన కొనసాగించారు. నాటకీయ పరిణామాల మధ్య మార్షల్స్ వారిని బలవంతంగా అసెంబ్లీ ఆవరణ బయటకు తీసుకొచ్చి పోలీస్ వ్యాన్ ఎక్కించారు. మీడియాను బయటకు పంపించి, సీఎంలు రాకపోకలు సాగించే ఒకటో నంబర్ గేటువైపు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించి మరీ వారిని ఆ గేటు గుండా తరలించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వదిలేశారు. దాంతో... రాత్రి స్పీకర్ చాంబర్లోనే నిద్రించి బుధవారం కూడా నిరసన కొనసాగించాలన్న టీడీపీ నేతల ప్రణాళిక భగ్నమైంది.
ఉదయం నుంచీ స్పీకర్ చాంబర్లోనే..
బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండవడం తెలిసిందే. దాన్ని ఎత్తేసేలా చూడాలంటూ రాజ్‌భవన్ మొదలు రాష్ట్రపతి భవన్‌వరకు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో స్పీకర్‌తోనే తేల్చుకోవాలని వారు సోమవారం రాత్రే నిర్ణయించుకున్నారు. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో మంగళవారం ఉదయం 9.15కే ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, జి.సాయన్న, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, ప్రకాశ్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, గాంధీ, మాధవరం కృష్ణారావు నేరుగా స్పీకర్ చాంబర్‌కు చేరుకున్నారు. ఆయన వచ్చేదాకా అక్కడే నేలమీద కూర్చున్నారు. స్పీకర్ రాగానే.. పార్టీ ఫిరాయింపులు, మంత్రి తలసాని బర్తరఫ్, జాతీయగీతాలాపన సమయంలో తమ ప్రవర్తనకు సంబంధించిన వీడియోల విడుదల, సభ ప్రత్యక్ష ప్రసార బాధ్యతలను మంత్రి హరీశ్‌రావు సన్నిహుతులకు నామినేషన్‌పై ఇవ్వడం తదితరాలపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీట్ల కేటాయింపు, ప్రత్యక్ష ప్రసారాల బాధ్యతలపై బుధవారం చెబుతానన్న స్పీకర్.. ఫుటేజీలు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఫిరాయింపులు, తలసాని రాజీనామాపై నిర్ణయానికి సమయం పడుతుందన్నారు. మరింత స్పష్టతకు టీడీపీ నేతలు పట్టుబట్టడంతో ఆయన ఆగ్రహించారు. ‘నిబంధనల మేరకు నడుచుకుంటాను. నన్నెవరూ శాసించలేరు’ అని చెప్పి సభలోకి వెళ్లారు. దాంతో స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆయన చాంబర్లోనే బైఠాయించారు. మధ్యాహ్న భోజన సమయం లో స్పీకర్ తిరిగొచ్చి, నిరసన విరమించాల్సిందిగా, భోంచేయాల్సిందిగా కోరగా ఎమ్మెల్యేలు నిరాకరించారు.
విడతలవారీగా ఎమ్మెల్యేల భోజనాలు
భోజన విరామం తర్వాత స్పీకర్ సభకు వెళ్లగానే టీడీపీ ఎమ్మెల్యేలు విడతలవారీగా భోజనాలు చేశారు. ఓ హోటల్ నుంచి ముందుగానే టీడీఎల్పీ కార్యాలయానికి తెప్పించుకున్న భోజనాలను ముగ్గురేసి చొప్పున వెళ్లి తిని వచ్చి నిరసనను కొనసాగించారు. ఎర్రబెల్లి మాత్రం భోంచేయలేదు. తలసాని బర్తరఫ్, పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ స్పష్టత ఇచ్చేదాకా ఆయన చాంబర్లోనే కూర్చుంటామని లాబీల్లోకి వచ్చి మీడియాకు చెప్పారు. రాత్రి 7.45 గంటలకు స్పీకర్ సభను వాయిదా వేసి తన చాంబర్లోకి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. తమ డిమాండ్లను పరిష్కరించేదాకా కదలబోమని, అక్కడే నిద్ర పోతామని వారనడంతో మరో మార్గంగుండా ఆయన వెళ్లిపోయారు. అది తెలియని ఎమ్మెల్యేలు చాంబర్లోనే కూర్చుండిపోయారు. చీఫ్ మార్షల్ వారికి విషయం చెప్పి, వెళ్లిపోవాల్సిందిగా కోరారు. వారందుకు నిరాకరించారు.దాంతో మీడియాను బయటకు పంపాక వారిని ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో వదిలేశారు.
ఉరికించి కొట్టే రోజులొస్తాయి: ఎర్రబెల్లి
అప్రజాస్వామికంగా విపక్షం గొంతు నొక్కి, అసెంబ్లీకి రాకుండా చేసి సభను నడుపుతున్న ప్రభుత్వ తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. రాత్రి ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన స్పీకర్ కొందరి ఆజ్ఞలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీని హరీశ్ శాసిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘అసెంబ్లీ వీళ్ల అయ్య, తాతల జాగీరా? హరీశ్! ప్రజలు ఉరికించి కొట్టే రోజులొస్తాయి ఏమనుకుంటున్నావో!’’ అని హెచ్చరించారు. అసెంబ్లీ కేసీఆర్ కుటుంబం సొత్తు కాదన్నారు. ‘‘సభలో లేని టీడీపీ ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేశారు. ఇదేం న్యాయమంటే రాసిచ్చి పొండని స్పీకర్ అంటారు. 10లేఖలిచ్చినా స్పందన లేదు. మేమెక్కడ కూర్చోవాలో కూడా వారే నిర్ణయిస్తారా? ఇలాంటి స్పీకర్‌ను 25 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు’’ అన్నారు. దీనిపై గురువారం గవర్నర్‌ను కలుస్తామన్నారు.