సోలార్ స్కామ్ పై కేరళ అసెంబ్లీలో రగడ
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ సమావేశాలకు సోలార్ స్కామ్ సెగ తాకింది. శుక్రవారం ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమాశాలకు ఆదిలోనే తీవ్ర ఆటంకం ఏర్పడింది. గవర్నర్ పి. సదాశివం ప్రసంగంతో మొదలు కావాల్సిన ఈ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం చెలరేగింది. గవర్నర్ ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ రాజీనామా చేయాలనే నినాదాలతో హోరెత్తించారు.
చివరకు సభలో ప్రతిపక్ష నేత అచ్యుతానందన్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలపై ఒక ప్రకటన చేసేంతవరకు గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాలేదు. అయినా సభ్యుల ఆగ్రహం చల్లారలేదు. సీఎం రాజీనామాకు పట్టుబడుతూ ప్రతిపక్ష ఎల్డీఎఫ్ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.