సారీ... సర్వర్ డైన్
సిటీబ్యూరో: ప్రావిడెంట్ ఫండ్ సర్వర్ ముప్పు తిప్పలు పెడుతోంది. ఫీఎఫ్ క్లైయిమ్స్ కోసం భవిష్య నిధి కార్యాలయం చుట్టూ ఖాతాదారుల ప్రదక్షిణ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కార్యాలయం (ఈఫీఎఫ్‌వో)లో 15 రోజుల నుంచి సర్వర్ సమస్య తలెత్తింది. హైదరాబాద్ నుంచి ప్రధాన కార్యాలయానికి గల ఆన్లైన్ సేవల ప్రధాన సర్వర్‌కు సాంకేతిక ఆటంకాలు తెలెత్తాయి. పెన్షన్, రుణాలు, ఖాతాల విత్ డ్రా, సెటిల్ మెంట్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మరోవైపు కనీసం పీఎఫ్ సమాచారం కూడా తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ సొమ్ము చేతికి అందే పరిస్థితి లేకుండా పోయింది. పీఎఫ్ క్లైయిమ్స్ ను నమ్ముకొని పనులు పెట్టుకున్న వారికి పరిస్థితి మరింత ఆగమ్య గోచరంగా తయారైంది.
సిస్టమ్ నాట్ వర్కింగ్
పీఎఫ్ ఆఫీస్‌లో కౌంటర్ల పై సిస్టమ్స్ నాట్ వర్కింగ్ నోటీసులు ప్రత్యక్షమయ్యాయి. 15 రోజులనుంచి సర్వర్ డౌన్ కావడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా కౌంటర్లపై కంప్యూటర్లు పనిచేయడం లేదని నోటీసులు అంటించి పీఎఫ్ అధికారులు చేతులు దులుపుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.ఖాతాదారులు ఉన్నతాధికారులను కలిసేందుకు ప్రయత్నిస్తే సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుంటున్నారు. కనీసం ఆన్లైన్ సమస్య ఎప్పటి వరకు అధిగమిస్తారో వెల్లడించాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.