రెండు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ తేదీలు దాదాపు ఖరారయ్యాయి. జిల్లాలో రెండు విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించాలని యంత్రాంగం ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తేదీలు ఖరారుచేసి నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం ఆకస్మికంగా 22 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. దీంతో ఈ రెండు ఎన్నికలు సజావుగా నిర్వహించాలనే ఉద్దేశంతో యంత్రాంగం కొన్ని మార్పులు చేపట్టింది.
ఏప్రిల్ 6న తొలివిడత ఎన్నికల్లో భాగంగా వికారాబాద్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్లలోని 15 మండలాలు, అదేవిధంగా ఏప్రిల్ 11న రెండో విడతలో సరూర్నగర్, చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని 17 మండలాల్లోని ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. ఈ వివరాలను ఎన్నికల సంఘానికి నివేదించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఫలితాలు మాత్రం సార్వత్రిక ఎన్నికల తర్వాతే ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో ప్రాదేశిక ఎన్నికలు పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులను సంబంధిత ఆర్డీఓ కార్యాలయాల్లో భద్రపర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.