8 విభాగాల్లో ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ పూర్తి
* అభ్యంతరాలకు రెండు వారాల గడువు
* నోటిఫికేషన్ తర్వాత 14 రోజుల్లోగా కేటాయించిన చోట చేరాలి
* పదవీ విరమణ చేసినవారినీ పంపిణీ చేసిన కమలనాథన్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది శాఖలకు చెందిన విభాగాల్లో కమలనాథన్ కమిటీ రాష్ట్రస్థాయి ఉద్యోగుల ప్రొవిజినల్ పంపిణీని పూర్తిచేసింది. వర్క్ టు సర్వ్ ఆర్డర్లో ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు తాత్కాలికంగా పంపిణీ చేస్తూ కమిటీ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆయా ఉద్యోగులిచ్చిన ఆప్షన్లు, స్థానికత, మార్గదర్శకాల ఆధారంగా ఏ ఉద్యోగి ఏ రాష్ట్రంలో పనిచేయాలనే విషయాన్ని నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే ఉద్యోగుల సీనియారిటీ ర్యాంకుల్నీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ స్థానికత గల ఉద్యోగుల్ని ఆప్షన్ల నిబంధనల మేరకు కొంత మందిని తెలంగాణకు పంపిణీ చేశారు. అలాగే తెలంగాణ స్థానికత గల కొంతమంది ఉద్యోగులను ఏపీకి పంపిణీ చేశారు. ఈ ఎనిమిది శాఖలకు చెందిన విభాగాల్లో పంపిణీ అయిన ఉద్యోగులు అభ్యంతరాలు తెలియజేసేందుకు రెండు వారాల గడువిచ్చారు.
అభ్యంతరాలకు మే రెండో తేదీని తుది గడువుగా కమలనాథన్ కమిటీ విధించింది. నోటిఫికేషన్ జారీ అయిన 14 రోజుల్లోగా పంపిణీ చేసిన రాష్ట్రానికి వెళ్లి ఉద్యోగంలో చేరాలని స్పష్టం చేశారు. ఉన్నత విద్యా శాఖలో భాగమైన ఇంటర్మీడియెట్ డెరైక్టరేట్‌కు చెందిన రాష్ట్ర స్థాయి ఉద్యోగుల్లో 38 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 35 మంది ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రానికి పంపిణీ చేశారు. పాఠశాల విద్యా శాఖలో భాగమైన వయోజన విద్య డెరైక్టరేట్‌కు చెందిన రాష్ట్ర స్థాయి ఉద్యోగుల్లో 27 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 29 మందిని తెలంగాణకు పంపిణీ చేశారు.
ఉన్నత విద్యా శాఖలో భాగమైన జిల్లా గెజిటీర్స్లో పనిచేస్తున్న రాష్ట్ర స్థాయి ఉద్యోగుల్లో ఏపీకి 8 మందిని, తెలంగాణకు ఆరుగురిని పంపిణీ చేశారు. రవాణా శాఖ డెరైక్టరేట్లలో రాష్ట్రస్థాయి ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిలో ఏపీకి 50 మందిని, తెలంగాణకు 59 మందిని పంపిణీ చేశారు. పరిశ్రమల శాఖలో భాగమైన చేనేత జౌళి డెరైక్టరేట్లలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో తెలంగాణకు 23 మందిని, ఏపీకి 28 మందిని పంపిణీ చేశారు. గిరిజన సంక్షేమ డెరైక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏపీకి 49, తెలంగాణకు 37 మందిని పంపిణీ చేశారు.
సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డు డెరైక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏపీకి 39 మందిని, తెలంగాణకు 114 మందిని పంపిణీ చేశారు. ప్రణాళికా శాఖలో భాగమైన అర్థగణాంక కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏపీకి 127 మందిని, తెలంగాణకు 113 మందిని పంపిణీ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం పదవీ విరమణ చేసిన ఉద్యోగుల్నికూడా ఇరు రాష్ట్రాలకు నిబంధనల మేరకు కమలనాథన్ కమిటీ పంపిణీ చేసింది.