పల్లెను పీడిస్తున్న నోట్ల రగడ
డబ్బు కోసం ఔరంగాబాద్‌లో స్టేషన్‌రోడ్‌లోని ఒక బ్యాంక్ శాఖ ముందు నిలబడిన వడ్రంగి సయ్యద్ మోదక్ ‘‘చాలా ఆస్పత్రులలోను, మందుల దుకాణాలలోను రూ. 500, రూ. 1,000 నోట్లను స్వీకరించడం లేద’’ని చెప్పాడు. తీవ్ర అనారోగ్యం పాలైన తన బంధువు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇతడు ఆస్పత్రి నుంచి ఇంకో ఆస్పత్రికి పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఏ ఆస్పత్రిలోను ఆ నోట్లు తీసుకోవడానికి అంగీకరించలేదని అతడు చెప్పాడు. ఇప్పుడు అందరి కళ్లు నాసిక్ మీదే ఉన్నాయి.
నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కోసం ప్రధాని నరేంద్ర మోదీ కంటున్న కల ఆ గ్రామంలో సాకారమైనట్టే కనిపిస్తున్నది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్ట ణానికి దగ్గరగా, ఇంకా చెప్పాలంటే రేపో మాపో ఆ పట్టణంలో భాగ మైపోతుందనిపిస్తున్న షికల్థానా గ్రామంలో ఎవరి దగ్గరా చిల్లిగవ్వ లేదు. బ్యాంకులనే కాదు, ఏ బ్యాంకు ఏటీఎం ముందు కూడా ప్రజలెవరూ ఉçస్సూరంటూ బారులు తీరడం లేదు. సాధారణంగా బ్యాంకు శాఖల ముందు నిఘా వేసే పోలీసులు కూడా ఎక్కడా కనిపించరు.
అయినా సంతోషించవలసిన విషయం– త్వరలో ఆ ఊరి వారందరి వేళ్ల మీద సిరా గుర్తులు దర్శనమివ్వబోతున్నాయి. అయితే కొంచెం అవతలే ఉన్న చరిత్రాత్మక ఔరంగాబాద్‌లోని ఒక హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ శాఖలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడి షాహగంజ్ ఎస్బీహెచ్ శాఖ సిబ్బంది నిరుపేదలైన తమ ఖాతాదారులకు సేవలు అందించలేక తీవ్ర నిస్పృహకు లోనవుతున్నారు. ఈ ఒక్క బ్యాంకు శాఖలోనే కాదు, ఇతర బ్యాంకుల శాఖలలో కూడా బాగా చివికి, నలిగిపోయి; ఇక ధ్వంసం చేయడానికి రిజర్వు బ్యాంకుకు పంపేందుకు సిద్ధం చేసిన రూ 50, రూ. 100 నోట్లను మరోసారి చెలామణిలోకి తెచ్చేందుకు కోట్లలో తెచ్చి పెట్టారు. ఈ సంగతి రిజర్వు బ్యాంకుకు తెలుసు. అయినా మౌనం దాల్చింది.
‘మన ముందున్న అవకాశాలు ఏమిటి?’ అని బ్యాంకు సిబ్బందిని అడగాలి. ప్రస్తుతం ప్రజలకి చిన్న నోట్ల అవసరమే ఎక్కువ. అవి లేక ప్రస్తుతం ప్రజల పనులు, లావాదేవీలన్నీ నిలిచిపోయాయి. ఆ ఆదివారం మేం ఇలా సిబ్బందితో మాట్లాడుతుంటే, బ్యాంకు ముందు కిలోమీటరు మేర ఉన్న ఆ క్యూ నుంచి జావెద్ హయత్ ఖాన్ అనే చిరు వ్యాపారి మా దగ్గరకి వచ్చాడు. తన కుమార్తె రషీదా ఖాతున్ వివాహ శుభలేఖను అందించాడు.
‘‘నా బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం రూ. 27,000’’ అంటూ అతడు చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘మరో మూడు వారాలలో జరగబోయే నా కూతురి పెళ్లి కోసం అందులోనే రూ. 10,000 ఇవ్వాలని కోరాను. ఆ మొత్తం తీసుకోవడానికి కూడా నన్ను అనుమతించడంలేదు’’ అన్నాడతడు. నిజానికి అతడు అంతకు ముందు రోజే రూ. 10,000 విత్‌డ్రా చేసుకున్నాడు. మరో రూ. 10,000 మరునాడు తీసుకుందామని అనుకున్నాడు. ఇంతలోనే బ్యాంకు డబ్బు తీసుకునే సౌకర్యాన్ని నిలిపివేసింది. ఎందుకంటే పాము మెలికలను మరిపిస్తూ బారులు తీరిన ఆ జనానికి కావలసినంత పైకం బ్యాంకులో లేదని సిబ్బంది నమ్మకం. ప్రతి వ్యక్తికి కొద్దిపాటి మొత్తాన్ని ఇవ్వడమే సాధ్యం కావచ్చునని కూడా వారు భావించారు. అందుకే కూతురి పెళ్లి కోసం ఆందో ళన పడుతున్న ఖాన్‌కు చేయూతనివ్వాలని ఇద్దరు ప్రయత్నించారు. అతడి ఖాతాలో జమ అయిన మొత్తం కూతురి పెళ్లి కోసం వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చినదేనని వారు వివరించారు.
ఇప్పటికే చాలామంది విశ్లేషకులు, రచయితలు, ఆఖరికి అధికారిక నివే దికలు వెల్లడించినట్టు భారత ‘నల్ల’ ఆర్థిక వ్యవస్థ బంగారం రూపంలోను, భూ బినామీ వ్యవహారాలతో పాటు విదేశీ కరెన్సీ రూపంలోను ఉంది. అంతేతప్ప, మామ్మగారి పాత బోషాణంలో కట్టల రూపంలో లేదు. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు చైర్మన్ చెప్పింది కూడా ఇదే. ‘దేశ విదేశాలలోని నల్లధనం సమస్యను ఎదుర్కొనడం ఎలా?’ అన్న పేరుతో 2012లో ఇచ్చిన ఒక నివేదికలో ఆయన పేర్కొన్న అంశమిది. గతంలో 1946, 1978లలో రెండు పర్యాయాలు నోట్ల రద్దు కోసం చేసిన ప్రయత్నం ఎంత విషాదాం తమైందో కూడా ఆ నివేదికలోనే (పేజీలు 14, పార్ట్ 2, 9.1) ప్రస్తావించారు. అయినప్పటికీ సరిగ్గా ఈ పనినే భారతీయ జనతా పార్టీ పునరావృతం చేసింది. నోట్ల రద్దు తరువాత దేశ వ్యాప్తంగా తీవ్ర క్షోభను, దుఃఖాన్ని కలిగించిన, నమ్మశక్యం కూడా కాని ఈ అవివేకపు చర్యను ఆకాశానికెత్తడానికే కొందరు యాంకర్లూ, విదూషకులూ టెలివిజన్లలో ‘మోదీ మాస్టర్‌స్ట్రోక్’ అన్న పదాన్ని సైతం ప్రయోగించారు. ఏ ‘స్ట్రోక్’ ఎవరు ఇచ్చినా దానితో గాయపడే హృదయం మాత్రం గ్రామీణ ఆర్థిక వ్యవస్థదే.
నోట్ల రద్దు స్ట్రోక్‌తో తగిలిన ఇక్కట్ల నుంచి కోలుకోవడానికి రెండు రోజులు చాలునని మొదట ఆర్థిక మంత్రి, ఆయన పార్టీ సహచరులు ధీమాగా చెప్పారు. తరువాత అరుణ్ జైట్లీ గారే కోలుకోవడానికి రెండు మూడు వారాలదాకా పడుతుందని మొదట చెప్పిన దానిని సవరించారు. ఆ తరు వాత ఆరోగ్యం సంతరించుకోవడానికి రోగికి 50 రోజుల కాలం అవసర మవుతుందని జైట్లీగారి సీనియర్ సర్జన్ నరేంద్ర మోదీ సెలవిచ్చారు. అంటే ఈ వైద్యంతోనే మనం 2017 లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ లోపున దేశ వ్యాప్తంగా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు బారులు తీరిన జనంలో ఎంతమంది రాలిపోతారో చెప్పలేం. అయితే రోజురోజుకీ అలాంటి మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.
‘‘నాసిక్ జిల్లా లాసాల్‌గావ్‌లో రైతులు ఈ నగదు సంక్షోభం కారణంగా ఉల్లిపాయల మార్కెట్‌కు తాళాలు బిగించి వెళ్లిపోయార’’ని ‘ఆధునిక్ కిసాన్’ వార పత్రిక సంపాదకుడు నిశికాంత్ భాలేరావ్ చెప్పారు. ‘‘విదర్భ, మరాఠ్వా డాలలో క్వింటాల్ పత్తి ధర 40 శాతం మేర శరవేగంగా పడిపోయింద’’ని కూడా తెలియచేశారు. ఎక్కడో చెదురుమదురుగా మినహా లావాదేవీలు, అమ్మకాలు స్తంభించిపోయాయి. ‘‘ఎవరి దగ్గరా డబ్బుల్లేవు. కమిషన్ ఏజెంట్లు, ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు– అంతా ఒకేరకంగా తీవ్ర స్థాయిలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు’’ అని ‘ది టెలిగ్రాఫ్’ నాగ్‌పూర్ విలే కరి జయదీప్ హర్దికర్ అన్నారు. ‘‘మామూలుగా గ్రామీణ ప్రాంత బ్యాంకు శాఖలలో చెక్కులను మదుపు చేయడం చాలా యాతనతో కూడిన పని. ఇప్పుడు వాటిని విత్‌డ్రా చేసుకోవడం ఒక పీడకల మాదిరిగా ఉంది’’ అని కూడా ఆయన చెప్పారు.
అందుకే, చాలా తక్కువ మంది రైతులు మాత్రమే చెక్కులు తీసు కోవడానికి ఒప్పుకుంటారు. ఇదంతా వాస్తవ రూపం దాల్చేదాకా వాళ్ల ఇళ్లు గడవడం ఎలాగ? నిజానికి చాలామందికి బ్యాంకు ఖాతాలు లేనేలేవు. మహారాష్ట్రకు చెందిన ఒక ప్రభుత్వ రంగ ముఖ్య బ్యాంకుకు దేశ వ్యాప్తంగా 975 ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో 549 ఏటీఎంలలో మొండిచేయి తప్ప మరో డినామినేషన్ ఏదీ లేదు. ఇలా పనిచేయకుండా ఉన్న ఏటీఎంలు ఎక్కువ గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నాయి.
కిందిస్థాయిలో జరిగే లావాదేవీలో నగదు వెల్లువెత్తుతూ ఉంటుంది. ఒక వారంలోగా చిన్న చిన్న నోట్లు బ్యాంకులకు చేరకపోతే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాగలదని గ్రామీణ ప్రాంత బ్యాంకుల సిబ్బంది ఊహిస్తోంది. అయితే, ఇప్పటికే సంక్షోభం ఇక్కడ తలెత్తిందనీ, ఏదో కొంత పైకం బ్యాంకు లకు చేరినా ఆ సంక్షోభాన్ని నిలువరించడం సాధ్యం కాదనీ ఇతరులు అభి ప్రాయపడుతున్నారు. తన దగ్గర పనిచేస్తున్న కూలీలు ఇవాళో రేపో హింసాత్మక బాట పట్టక తప్పకపోవచ్చునని ఔరంగాబాద్‌లోనే డబ్బు కోసం క్యూలో నిలబడిన పర్వేజ్ పైథాన్ చెప్పారు. ఆయన భవన నిర్మాణ రంగంలో పనిచేస్తారు. ‘‘ఇప్పటి దాకా వారు చేసిన పనికి కూలీ చెల్లించవలసి ఉంది. కానీ ఇప్పుడు వాళ్ల చేతిలో పెట్టడానికి నా దగ్గర డబ్బు లేదు’’ అని పర్వేజ్ వివరించాడు. పిల్లలకు ఆహారం సమకూర్చి పెట్టడం తమలాంటి తల్లులకు రోజు రోజుకు భారంగా మారిపోతోందని షికాల్థానాకే చెందిన రెయిసా అఖ్తర్ ఖాన్ వాపోయారు. ‘‘మేం గంటల తరబడి క్యూలో నిలబడవలసి వస్తోంది. దానితో పిల్లలకు వేళకు తిండి లభించక ఆకలితో మాడుతున్నార’’ని కూడా ఆమె చెప్పారు.
తమ ఇళ్లలో వంట సంబారాలు రెండు నుంచి నాలుగు రోజులకు మించి రావని క్యూలలో నిలబడిన చాలామంది మహిళలు చెప్పారు. ఈ లోపున నోట్ల సమస్య సమసిపోవడం సాధ్యంకాదన్న సంగతి వారిని గడగడలా డిస్తోంది. అవును, అంతేకావచ్చు.
రైతులు, భూమిలేని కూలీలు, పనిమనుషులు, పింఛనుదారులు, చిన్న వ్యాపారులు ఇంకా ఇతర వర్గాల వారు ఈ సమస్యతో సతమతమవు తున్నారు. చాలా వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా అప్పుల పాల వుతున్నారు. తాము చేయవలసిన చెల్లింపుల కోసం అప్పులు తీసుకుంటు న్నారు. ఆహార పదార్థాలు కొనుగోలు చేయడానికి కూడా క్యూలలో నిలబడు తున్నారు. ‘రోజులు గడిచే కొద్దీ ఈ క్యూలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు’ అని ఔరంగాబాద్‌లోని స్టేషన్ రోడ్ శాఖ ఉద్యోగి ఒకరు చెప్పారు.
గరిష్టంగా రూ. 500 నోట్లు ఎనిమిది లేదా, రూ. 1,000 నోట్లు రెండు మార్చుకోవడానికి అనుమతించారు. ఈ లావాదేవీని ఒక్కసారే చేసుకోవడా నికి అనుమతి ఉంది. ఒకవేళ మళ్లీ నోట్లు మార్చుకోవాలంటే ఒక రోజు ఆగాలి. అది కూడా వేరే గుర్తింపుతో లావాదేవీలు నిర్వహించవచ్చు. ఇవాళ ఆధార్‌కార్డును ఆధారంగా చూపితే రేపు పాస్‌పోర్టు, ఎల్లుండి పాన్ కార్డు చూపిస్తూ మీ ఉనికిని గుర్తు పట్టకుండా నోట్లు మార్చాలి.
ప్రస్తుతం ఈ కిటుకు తెలిసినవాళ్లు కూడా తక్కువే. చాలామందికి ఈ సంగతి తెలియదు. కానీ పరిమితులు విధించే విషయంలో ప్రభుత్వం వెర్రి తనం అవధులు దాటిపోయింది. క్యూలలో నిలబడి డబ్బులు తీసుకున్న తరువాత పోలింగ్ సమయంలో వేసినట్టు చెరగని ముద్రను వేళ్ల మీద వేయ డానికి ప్రభుత్వం నిర్ణయించింది.
డబ్బు కోసం ఔరంగాబాద్‌లో స్టేషన్‌రోడ్‌లోని ఒక బ్యాంక్ శాఖ ముందు నిలబడిన వడ్రంగి సయ్యద్ మోదక్ ‘‘చాలా ఆస్పత్రులలోను, మందుల దుకాణాలలోను రూ. 500, రూ. 1,000 నోట్లను స్వీకరించడం లేద’’ని చెప్పాడు. తీవ్ర అనారోగ్యం పాలైన తన బంధువు ప్రాణాలు కాపా డుకోవడానికి ఇతడు ఆస్పత్రి నుంచి ఇంకో ఆస్పత్రికి పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఏ ఆస్పత్రిలోను ఆ నోట్లు తీసుకోవడానికి అంగీకరించలేదని అతడు చెప్పాడు.
ఇలా ఉండగా ఇప్పుడు అందరి కళ్లు నాసిక్ మీదే ఉన్నాయి. కొత్తగా అచ్చయిన కరెన్సీ అక్కడ నుంచే దేశం నలుమూలలకీ పంపిస్తారు. అందులో ఇంతవరకు గ్రామీణ ప్రాంతాల వారికి ఏమీ చేరలేదు. అక్కడికి డబ్బులు చేరే రోజు కోసం వారు ఎదురు చూస్తున్నారు.
వ్యాసకర్త పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకుడు
ఎవ్రిబడీ లవ్స్ ఏ గుడ్ డ్రాట్ గ్రంథకర్త
ఈ–మెయిల్: @PSainath.org
పాలగుమ్మి సాయినాథ్