ఫాస్ట్‌గా పాస్‌పోర్ట్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టు అమలు ద్వారా పౌరులకు సకాలంలో పారదర్శక సేవలను అందించగలుగుతున్నామని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి పీఎస్. కార్తికేయన్ తెలిపా రు. తద్వారా పోలీసు పరిశీలన సమయాన్ని మినహాయిస్తే 14 రోజుల్లోనే పాస్‌పోర్ట్‌ను పంపిణీ చేయగలుగుతున్నామని వెల్లడించా రు. మంగళవారం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు నగరంలో పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టు ద్వారా 11 లక్షల పాస్‌పోర్ట్‌లను పంపిణీ చేశామని, ఒక్క జూలైలోనే 40 వేల మందికి పంపించామని వివరించారు. పౌరుల పట్ల స్నేహయుతంగా వ్యవహరించే చర్యల్లో భాగంగా పాస్‌పోర్ట్ మేళాలను నిర్వహించడం ద్వారా రద్దీని చాలా వరకు నివారించగలిగామని తెలిపారు.
పాస్‌పోర్ట్ అర్జీదారులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగా నగరంలోని లాల్బాగ్, మారతహళ్లి పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో వసతులను పెంచామని తెలిపారు. లాల్‌బాగ్‌లో 45 రోజుల్లో, మారతహళ్లిలో 30 రోజుల్లో అపాయింట్మెంట్లను విడుదల చేస్తునామని చెప్పారు. ఈ రెండు కేంద్రాల్లో ఏటీఎంలను నెలకొల్పడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. పోలీసు పరిశీలన కోసం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ పరిధిలోని 102 పోలీసు స్టేషన్లలో ‘డెరైక్ట్ టు ఠాణా’ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పౌరుల ప్రయోజనార్థం తాము విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పలు ప్రతిపాదనలు చేశా
మని ఆయన వివరించారు. ఇందులోని ముఖ్యాంశాలు..
= పాస్‌పోర్ట్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కేంద్రాల సామర్థ్యాన్ని పెంచాలి. తద్వారా ఏటా 30 వేల అదనపు అపాయింట్మెంట్లకు అవకాశం ఉంటుంది.
= పోలీసు శాఖ సహకారంతో పోలీసు పరిశీలన కాలాన్ని తగ్గించాలి. దీని వల్ల పాస్‌పోర్ట్ అందించే కాలాన్ని బాగా తగ్గించడానికి వీలవుతుంది.
= కర్ణాటక ఈ-గవర్నెన్స్ శాఖ సహకారంతో బెంగళూరు వన్, కర్ణాటక వన్ కేంద్రాల సేవలను కూడా వినియోగించుకోవాలి.