సురక్షిత హైదరాబాద్
జీఎంఆర్, పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం ఆకాంక్ష
ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పటిష్ట భద్రతా వ్యవస్థ
నగరం మొత్తాన్ని పర్యవేక్షించే వ్యవస్థ రూపకల్పనకు ఆదేశం
నేరాల అదుపునకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని కేసీఆర్ నిర్దేశం
ఈ విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి సహకరిస్తామని జీఎంఆర్ హామీ
హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో హైదరాబాద్ నగరంలో పటిష్ట భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అకాంక్షించారు. నగరం మొత్తాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఆధునిక వ్యవస్థను రూపొందించాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. హైదరాబాద్ త్వరలోనే 4జీ కనెక్టివిటీ సిటీగా మారుతున్న దృష్ట్యా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. సచివాలయంలో జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అధికారులు, జంట నగరాల కమిషనర్లతో బుధవారం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రపంచంలోని వివిధ నగరాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న భద్రతా వ్యవస్థలపై ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ప్రతినిధులు.. సేఫ్ సిటీ ప్రాజెక్టును, లండన్ తరహా భద్రతా వ్యవస్థను ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. సీసీ కెమెరాలు, సెన్సార్లు, అలారమ్ సిస్టమ్‌లు, డేటా స్టోరేజీ అండ్ వీడియో అనాలిటిక్స్ సిస్టమ్, కమ్యూనికేషన్ నెట్వర్క్, కమాండ్ క ంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర వ్యవస్థలను సమగ్రంగా వివరించారు. నేరం జరిగిన వెంటనే వేగంగా సమాచారం తెలుసుకోవడం, దాన్ని విశ్లేషించి వేగంగా స్పందించే వ్యవస్థలను అభివృద్ధి చేయడం, నేరాలను నిరోధించడం వంటి ప్రక్రియలపై ఈ ప్రజెంటేషన్ సాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నగరంలో ప్రజా భద్రతా వ్యవస్థను, నిఘా పద్ధతులను పటిష్టం చేయడానికి జీఎంఆర్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. నేరాల అదుపునకు పటిష్ట నిఘా వ్యవస్థకు సంబంధించి సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. నగరీకరణతో పాటే ట్రాఫిక్, ఆందోళనలు, మహిళలపై అఘాయిత్యాలు, అసాంఘిక చర్యలు వంటి సమస్యలు అనివార్యంగా పుట్టుకొస్తున్నాయని, వాటి నివారణపై ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని ఎదుర్కునే ప్రయత్నం చేయాలన్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కాలనీ వాసులు సైతం తమ భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారని, వాటిని కూడా పోలీస్ భద్రతా వ్యవస్థతో అనుసంధానం చేయాలని సూచించారు. దీనికి సంబంధించి త్వరలోనే సమావేశమై చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. నగరాన్ని పది జోన్లుగా విభజించి ఎక్కడికక్కడ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరగాలని, ఇందుకు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిరంతరం ప్రభావవంతంగా పనిచేయాలని పేర్కొన్నారు. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత అభివృధ్ధి చేసే ప్రతిపాదనలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ఉన్నతాధికారులు, జీఎంఆర్ బిజినెస్ చైర్మన్ బీవీఎన్ రావు, జీఎంఆర్ ప్రెసిడెంట్ ప్రసన్న, యూకే కన్సల్టెంట్ డాన్ రాండల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
మరిన్ని విమానాశ్రయాలు సాధ్యమేనా..?
భవిష్యత్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్‌లో మరిన్ని విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ అభిప్రాయంపై తీవ్ర చర్చ మొదలైంది. శామీర్‌పేట, ఘట్కేసర్ దగ్గర అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు అవసరమని ఐఏఎస్ అధికారుల సమావేశంలో కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్ మధ్య జరిగిన త్రిపక్ష ఒప్పందం ప్రకారం ఈ విమానాశ్రయం నుంచి చుట్టూ 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలంటే జీఎంఆర్ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) పొందాల్సి ఉంటుంది. లేని పక్షంలో కొత్త వాటి నిర్మాణం కుదరదు. తన వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉన్నందున నూతన విమానాశ్రయాల నిర్మాణానికి జీఎంఆర్ నుంచి సానుకూల స్పందన రాకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.