కుక్కలున్నాయి జాగ్రత్త
బెంబేలెత్తుతున్న నగర ప్రజలు
నియంత్రణ చర్యలు శూన్యం
పలువురికి గాయాలు
కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలో కుక్కల బెడత తీవ్రంగా ఉంది. గల్లీల్లో ఎక్కడ పడితే అక్కడే ఉంటుండడంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. నిబంధనలు సాకుగా చూపి అధికారులు వీటని అదుపుచేయలేమని చేతులెత్తేస్తున్నారు. అపరిశుభ్ర ప్రాంతాల్లో పందుల బెడద ఉంటే.. అన్నీ గల్లీలో కుక్కలతో జనం అవస్థలు పడుతున్నారు. ఒంటరిగా వెళ్తున్న వారిపై గుంపులుగా దాడి చేస్తుండడంతో ఏమి చేయలేకపోతున్నారు.
చీకటి పడిందంటే బయటకు వచ్చేందుకు నగరవాసులు జంకుతున్నారు. పాదాచారులు, వాహనచోదకులను సైతం వెంటపడి మరీ తరుముతున్నాయి. కుక్కలను చూసి జనం పరుగులు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వెంటాడి మరీ కరుస్తుండడంతో వీటి బారినపడి గాయాలపాలైన వారి సంఖ్య అధికమైంది. ఒకటి కాదు, రెండు కాదు.. వేల సంఖ్యలో కుక్కలు రోడ్లపై స్వైర విహారం చేస్తున్నాయి.
అడుగడుగునా జనాలకు తిప్పలు
నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏటా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటిని అదుపు చేయడం నగరపాలకసంస్థ యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ఒకప్పుడు కుక్కలను నియంత్రించేందుకు కాంట్రాక్టు పద్ధతిన పనులు అప్పగించేవారు. కానీ నేడు ఎక్కడ అలాంటి చర్యలు కనిపించడం లేదు. దీంతో నగరంలో నెలకు పదిమందికి పైగా కుక్కకాటుకు గురవుతున్నట్లు సమాచారం.
శివారు ప్రాంతాల్లో తీవ్రం
నగరంలోని శివారు ప్రాంతాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. సుభాష్‌నగర్, కిసాన్‌నగర్, దుర్గమ్మగడ్డ, అశోక్‌నగర్, మారుతీనగర్, హౌసింగ్‌బోర్డుకాలనీ, కోతిరాంపూర్, కట్టరాంపూర్, భగత్‌నగర్, రాంచంద్రాపూర్‌కాలనీ, రాంనగర్, హరిహరనగర్ ప్రాంతాల్లో ఈ బెడద మరీ తీవ్రంగా ఉంది. ఇళ్లల్లో పెంచుకున్న కుక్కలకు సైతం టీకాలు వేయించడం లేదు. టీకాలు వేసిన ప్రతిసారీ రూ.3వేల వరకు ఖర్చవుతుండడంతో చాలా మంది టీకాలు వేయించడమే మరిచారు. ఇళ్లల్లో పెంచుకునే కుక్కలు కూడా బయటకు వచ్చినప్పుడు పిచ్చికుక్కల్లా ప్రవర్తిస్తున్నాయి. వీటిని కూడా నియంత్రించాల్సి ఉంది. కుక్కను పెంచుకునే యజమాని క్రమం తప్పకుండా టీకాలు వేయించేకార్డును పరీక్షిస్తే ఇది బయపడుతుంది. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.