ప్రత్యక్ష రాజకీయాలకు చిదంబరం స్వస్తి!
పుదుకొట్టాయ్(తమిళనాడు): ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలకాలని భావిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం తెలిపారు. 8 ఎన్నికల్లో పాల్గొని, 17 ఏళ్లు మంత్రిగా ఉన్న తాను పూర్తిగా సంతృప్తి చెందానని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పుదుకొట్టాయ్కు సమీపంలోని తిరుమయ్యం వద్ద జరిగిన బీసీల సదస్సులో చిదంబరం ప్రసంగించారు.
‘‘నేనేమీ జౌళి వంటి సాధారణ శాఖల్లో మంత్రిగా చేయలేదు. ఇలాంటి శాఖల్లో చేసుంటే ప్రశాంతంగా ఉండేది. కానీ, నేను హోం, ఆర్థిక శాఖలకు మంత్రిగా ఉన్నాను. రోజుకు 18 గంటలపాటు కష్టపడి పనిచేశాను. ప్రస్తుతం 68 ఏళ్లు. ఇంకెంత కాలమని రాజకీయాల్లో ఉంటాను?. శేష జీవితాన్ని మహాత్మా గాంధీ చూపిన మార్గంలో ప్రజా సేవలో గడుపుతాను’’ అని అన్నారు. తనకు ఒక్క పైసా అప్పులేదని, తానెవరికీ బాకీలేనని చెప్పిన చిదంబరం, పునర్జన్మలపై నమ్మకం లేదంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు.