కేతకి యజ్ఞమంటపంలో ఇకపై అభిషేకాలు
ఝరాసంగం: దక్షిణ కాశీగా పేరుగాంచిన, ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ కేతకి సంగమేశ్వరాలయంలో భక్తుల ఇబ్బందులు తీర్చేందుకు ఆలయ అధికారులు, గ్రామ పెద్దలు నూతన విధానాన్ని ప్రవేశ పెట్టారు. భక్తుల దర్శనం కొరకు గర్భగుడిలో నిర్వహించే అభిషేకాలను ఆలయ ఆవరణలోని యజ్ఞమంటపంలో నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి పి. మోహన్‌రెడ్డి తెలిపారు.
ఇంతకు ముందు కేతకి ఆలయానికి నిత్యం వచ్చే భక్తుల తాకిడి పెరుగుతుండటంతో దర్శనం కొరకు భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండి ఇబ్బందులు పడేవారు. ఓ వైపు భక్తులు అభిషేకాలు చేస్తుండగానే మరోవైపు భక్తులు స్వామి వారి దర్శనం చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని స్వామి వారి దర్శనం చేసుకునేందుకు శ్రావణ మాసంలో ప్రతి ఆది, సోమవారాల్లో అదే విధంగా ప్రతి అమావాస్య పర్వదినాల్లో అభిషేకాలను ఆలయ ప్రాంగణంలోని యజ్ఞమంటపంలో నిర్వహించనున్నారు.