అపూర్వ ఉపాధ్యాయులు!
=చదువు, శిక్షణ, బోధన ఒకే చోట
=వీరి భార్యామణులదీ అదే బాట
కవగుంట (రావికమతం), న్యూస్‌లైన్: ఆ యువ ఉపాధ్యాయులిద్దరూ చిన్నప్పట్నుంచి మంచి మిత్రులు. ఒకే ఊరు, ఒకే స్కూలు, ఒకే బెంచిపై కలిసి చదువుకున్నారు. కలిసి ఆడుకున్నారు. ఉన్నత చదువులు చదివారు. కలిసే బీఈడీ చేశారు. ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం పొందారు. యాధృచ్ఛికంగా వారు చదివిన పాఠశాలలోనే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మిత్రులంటే వీరే అన్న చందంగా గ్రామస్తులు, సాటి ఉపాధ్యాయులుచే గుర్తింపు పొందారు. కవగుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పులపర్తి రామచందర్‌రావు, కొమ్మోజు భాస్కరరావు చిన్న నాటినుంచి మంచి స్నేహితులు.
ఇద్దరిదీ వారు పనిచేసే పాఠశాలకు కిలోమీటర్ దూరంలో ఉన్న కింతలి గ్రామం. కవగుంట పాఠశాలలో చదువుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగే వారు. తరగతుల్లో చదువులోనూ పోటీపడేవారు. చదువుపై వీరికి గల మక్కువను గుర్తించిన వీరి గురువు వంటాకు సూర్యనారాయణ మరింత సహాయ సహకారాలందించడంతో ఒకొక్కటిగా పైచదువులు చదివారు.
తూర్పుగోదావరి జిల్లాలో బీఈడీ పూర్తి చేశారు. ఆపై 2008 డీఎస్సీలో ఒకేసారి పోస్టింగ్ కొట్టేశారు. వీరి స్నేహ బంధాన్ని దూరం చేయకూడదనుకున్నట్టుగా విధి కూడా వారికి సహకరించింది. అనూహ్యంగా ఇద్దరూ తాము చదివిన కవగుంట పాఠ శాలలోనే ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. కాకతాళీయంగా జరిగిందో, అదృష్టం వరించిందో, కష్టానికి ప్రతిఫలమో కాని వారిద్దరూ మిత్రులగానే కాకుండా మంచి ఉపాధ్యాయులుగానూ పేరు తెచ్చుకుంటున్నారు.
సతీమణులు సైతం...
మరో విశేషమేమిటంటే... వీరి సతీమణులు సైతం భర్తలనే అనుకరిస్తున్నామన్నట్టుగా టీటీసీకి ఎంపికయ్యారు. రామచంద్రరావు సతీమణి మాధవి, భాస్కరరావు భార్య నాగలక్ష్మి ఇద్దరూ గుంటూరులోనే టీటీసీలో శిక్షణ పొందుతున్నారు.