పులి.. ఆగిపోయింది!
తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన పులి సినిమా గురువారం విడుదల కావాల్సి ఉన్నా, అది విడుదల కాలేదు. సినిమా తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్ల విడుదల కూడా అనుమానంలోనే పడింది. బుధవారం తెల్లవారుజాము నుంచి పులి హీరో, హీరోయిన్లు, దర్శక నిర్మాతల అందరి ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయడం వల్లే విడుదల ఆగిపోయిందా అని కోలీవుడ్ టాక్. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలను తెల్లవారుజామున 4 గంటలకు, 5 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తారు. కానీ గురువారం ఇవేవీ ప్రదర్శించలేదు. సినిమా విడుదల కాకపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ధర్మపురి, సేలంలో థియేటర్ల వద్ద అభిమానులు ఆందోళన చేశారు. మదురైలో బస్సులను ధ్వంసం చేశారు.
ప్రీమియర్ షోలను ఎందుకు ఆపేయమన్నారో తమకు కూడా తెలియట్లేదని, సినిమా విడుదల విషయంలో క్యూబ్ సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నామని ఓ థియేటర్ యజమాని తెలిపారు. సినిమాను డిజిటల్‌గా స్ట్రీమింగ్ చేసే క్యూబ్ సంస్థకు పులి నిర్మాతలు ఇంకా కొంత సొమ్ము చెల్లించలేదని, ఆ విషయం సెటిల్ కాగానే విడుదలకు అనుమతి రావొచ్చని తెలుస్తోంది. మరోవైపు ఐటీ దాడుల కారణంగా ఎగ్జిబిటర్లకు చెల్లింపులు చేయడానికి ఆదాయపన్ను అధికారుల నుంచి అనుమతి రావాల్సి ఉందని, అందువల్లే సినిమా ఆగిందని కూడా చెబుతున్నారు.
ఉదయం 8 గంటలకు, 9 గంటలకు ప్రదర్శించాల్సిన షోలను కూడా థియేటర్లు రద్దు చేసుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత అనుమతి రావచ్చని, అయితే అది కూడా కచ్చితంగా వస్తుందని చెప్పలేమని అంటున్నారు. అమెరికా కెనడాలలో కూడా ప్రీమియర్ షోలను రద్దు చేసినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అట్మస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ తెలిపింది. చింబు దేవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి, శ్రుతిహాసన్, హన్సిక లాంటి పెద్ద హీరోయిన్లు నటించారు.