మహారాణి పాత్రలో శ్రీదేవి
ఇటీవల సినిమాల్లో మహారాజులు, మహారాణుల పాత్రలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా, ఇళయదళపతి విజయ్ హీరోగా తమిళంలో రూపొందుతున్న పులి సినిమాలో అలనాటి అందాల తార శ్రీదేవి మహారాణి పాత్రలో మెరిశారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కోలీవుడ్ రంగప్రవేశం చేస్తున్న శ్రీదేవి (51) చాలా శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాతో వెండితెర మీదకు తిరిగి వచ్చిన శ్రీదేవి.. అందులో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన గౌన్లు ధరించారు. అయితే ఇప్పుడు మాత్రం ఖరీదైన ఆభరణాలు, కిరీటాలతో ఇప్పుడు పూర్తిస్థాయి మహారాణి పాత్రలో మెరిశారు.
ఈ సినిమాకు సంబంధించిన 55 సెకన్ల టీజర్ సోమవారం విడుదలైంది. విజయ్ యుద్ధ సన్నివేశంతో ఈ టీజర్ మొదలవుతుంది. ఈగ ఫేం సుదీప్, శ్రుతిహాసన్ కూడా ఇందులో ఉన్నారు. చింబు దేవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హాలీవుడ్‌లోని గ్లాడియేటర్ తరహాలో ఉంటుందని చెబుతున్నారు. విజయ్ 41వ పుట్టిన రోజు సందర్భంగానే పులి టీజర్‌ను సోమవారం విడుదల చేశారు.
Here we present to you, the Teaser of #Puli - https://t.co/ZW6XC9Z7SC
— Vijay (@actorvijay) June 21, 2015