మూడు గంటల పాటు ఆగిన రైలు
విద్యుత్ సరఫరాలో అంతరాయమే కారణం
రెండు డీజిల్ ఇంజిన్లను తెప్పించి పంపిన రైల్వే సిబ్బంది
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకోవడంతో ఓ రైలు మూడు గంటల పాటు రైల్వేస్టేషన్లో నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి బెంగళూరుకు వెళుతున్న కంటోన్మెంట్ ప్యాసింజర్ రైలు మంగళవారం అనంతపురం రైల్వే స్టేషన్ దాటి మధ్యాహ్నం 1.57 గంటలకు చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో రైలు ఇంజిన్ ఆగిపోయింది. విషయాన్ని వెంటనే స్టేషన్ మాస్టర్ త్రిపురారికుమార్ బెంగళూరుకు చేరవేసి, ప్రత్యామ్నాయ వ్యవస్థ కల్పించాలని కోరారు. రైల్వే అధికారుల నుంచి అనుమతి వచ్చిన తర్వాత సాయంత్రం 4.45 గంటలకు పుట్టపర్తి నుంచి రెండు డీజిల్ ఇంజిన్లను రప్పించి బెంగళూరుకు పంపించారు. అయితే రైలు మూడుగంటల పాటు నిలిపోవడం...ఆస్టేషన్ కూడా మరీ చిన్నది కావడంతో ఆహారం దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, ఈ రైలు వెళ్లిన కొద్ది సేపటికి లోకమాన్యతిలక్ ఇదే మార్గంలో వెళుతూ బసంపల్లి రైల్వేస్టేషన్ రాగానే ఆగిపోయింది. అయితే సమస్య వెంటనే పరిష్కారం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.