వెలుగునిచ్చే వేస్ట్ బాటిల్..!
పనికిరాని వస్తువులతో కళాఖండాలు తయారు చేయడం చూస్తాం. వేస్ట్ మెటీరియల్ ను ఉపయోగించి విద్యుత్ ను వెలికి తీయడం తెలుసు. రీ సైకిలింగ్ తో కొత్త వస్తువుల తయారీ జరుగుతుంది. కానీ పనికి రాని ప్లాస్టిక్ బాటిల్స్ ను.. వెలుగులు నింపే బల్బులుగా వాడొచ్చంటున్నారు బెంగుళూరుకు చెందిన పంకజ్, తృప్తిలు. చీకట్లో మగ్గుతున్న నిరుపేదల కళ్ళల్లో వెలుగులు చూడాలన్నదే వారి ఆశయం. అందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నారు. వారి ఆలోచకు ఫలితాలే.. ప్రస్తుతం అక్కడ మురికి వాడలు, గిరిజన గ్రామాల్లో వెలుగులుగా మారుతున్నాయి.
మా అమ్మాయికి ప్రమాద భయం లేదు. అబ్బాయి ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండగల్గుతున్నాడు. మేమంతా ఎంతో ఆనందంగా హాయిగా ఇంట్లో గడుపుతున్నాం అంటుంది తన ఇంట్లో వేస్ట్ బాటిల్ వెలుగును పొందిన ఓ మహిళ. ఓ చిన్న ప్లాస్టిక్ పెట్ బాటిల్ వారి జీవితాల్లో వెలుగులు నింపిందంటే నమ్మశక్యం కావడం లేదు కదూ.. మనం నీళ్ళు తాగిన తర్వాత ఖాళీ బాటిల్ ను అవతల పారేస్తుంటాం. కానీ ఆ పడేసే ప్లాస్టిక్ సీసాలే సోలార్ వెలుగులతో ఎన్నో ఇళ్ళల్లో కాంతిని నింపుతున్నాయి.
విద్యుత్ కాంతులకు దూరంగా చీకట్లో నివసిస్తున్న మురికివాడలు, గిరిజన గ్రామాల్లోనూ ప్లాస్టిక్ పెట్ బాటిళ్ళు సోలార్ విద్యుత్ దీపాలుగా మారాయి. నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు 2011లో ఇలాక్ డియాజ్.. లైటర్ ఆఫ్ లైట్ పేరున ప్రారంభించిన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. ఆయన్నేపంకజ్, తృప్తిలు స్ఫూర్తిగా తీసుకున్నారు. బెంగళూరులో తమ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పంకజ్, తృప్తిలు కో ఫౌండర్లుగా బెంగుళూరులో ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇళ్ళల్లో రూఫ్ కి చిన్నపాటి రంధ్రం చేసి, నీటితో నింపిన ప్లాస్టిక్ పెట్ బాటిల్‌ను అక్కడ బిగిస్తారు. పగలంతా సూర్యకాంతి ఈ బాటిల్ లోని నీటిపై పడి పరావర్తనం చెంది ఇల్లంతా వెలుగు ప్రసరింపచేస్తుంటుంది. ఈ ఐడియా చాలా సింపుల్ గా ఉంటుంది. ప్రస్తుతం నాతోపాటు నాటీ టీమ్ ఈ కార్యక్రమంపై గ్రామాల్లో, పాఠశాలల్లో, పిల్లలు వారికి వారే ఈ లైట్ ను ఏర్పాటు చేసుకునే విధంగా ట్రైనింగ్ ఇస్తున్నామంటున్నారు తృప్తి.
అతి తక్కువ ధరలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు స్థానికంగా దొరికే వేస్ట్ మెటీరియల్ ను వినియోగిస్తున్నారు. లైటర్ ఆఫ్ లైట్ మురికి వాడలు, ఇరుకు సందులు, చీకటిగా ఉండే ప్రాంతాల్లో ప్రవేశపెట్టి అక్కడి వారి కళ్ళల్లో వెలుగులు చూస్తున్నారు. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అక్కడి వారు ఓ సంఘంగా ఏర్పడి తక్కువ ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకో గలితే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ కాలుష్య రహిత లైటింగ్ సిస్టమ్ ను రాత్రీ, పగలు ఉండేలా గిరిజన గ్రామాల్లో, నగరాల్లో ఉండే మురికి వాడల్లో, పాఠశాలల్లోప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీనికోసం తృప్తి, పంకజ్ ల టీమ్ పెట్ బాటిల్స్ తో సోలార్ బల్బ్ ను తయారు చేసే పనిలో ఉన్నారు. మొత్తం ఇరవై మంది ఉన్న టీమ్...35 ఇళ్ళలో పగలంతా ఉండేలా డేలైట్ బాటిల్స్ ను, మరో ఐదు నైట్ లైట్ బాటిల్స్ ను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఒక్కోసారి మురికివాడల్లోని జనం తమ ఇళ్ళకు రంధ్రం పెట్టేందుకు ఒప్పుకోని సందర్భాలు ఉంటాయని, అటువంటప్పుడు సంయమనంతో వారిలో అవగాహన పెంచి, అర్థమయ్యేలా విషయాన్ని వివరించాల్సి వస్తుంటుందని తృప్తి టీం చెప్తున్నారు. 2015 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైట్ గా మార్చేందుకు 'లైటర్ ఆఫ్ లైట్' టీమ్ తీవ్రంగా కృషి చేస్తోంది. అందుకు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను కూడ నిర్వహిస్తోంది. స్కూళ్ళు, కాలేజీల్లో విద్యార్థులకు ఈ ప్రాజెక్టుపై వివరాలు అందిస్తోంది.
'లైటర్ ఆఫ్ లైట్' ను సేవాభావం ఉన్న ప్రతివారూ అమలు చేసి, విద్యుత్ కు దూరంగా ఉన్న గ్రామాల్లోనూ, చీకటి ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాల్లోనూ వెలుగులు నింపొచ్చని ఈ టీమ్ చెప్తోంది. ముఖ్యంగా వేస్ట్ ను బెస్ట్ గా మార్చడానికి ఎంతో సృజన అవసరం. అంతకు మించి ఓ కొత్త రూపాన్ని సృష్టించాలన్న తపన కూడ ఉన్నప్పుడే ప్రతి విషయంలోనూ విజేతలుగా నిలుస్తారు. ఆకోవలో ప్రస్తుతం పంకజ్, తృప్తిలు కొనసాగుతున్నారు.