ముగ్గురిని బలిగొన్న డ్రైవర్ నిద్రమత్తు
వర్ధన్నపేట రూరల్ : డ్రైవర్ నిద్రమత్తు ఘోర ప్రమాదానికి దారితీసింది. వేగంగా వెళుతున్న బొలెరో వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన వర్ధన్నపేట శివారు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై రవీందర్ కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన బొంగు వెంకట్రాం, రాధమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు.
చిన్న కుమారుడు సోమేశ్వర్రావు(30) బీఎస్ బ్రదర్స్ ఇంజినీరింగ్ వర్క్స్ నిర్వహిస్తూ పవర్ప్లాంట్లలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల సమీపంలో నిర్మిస్తున్న ఎన్టీపీసీ పవర్‌ప్లాంట్ పనులు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఇటీవల పనులను ప్రారంభించారు. ఆ పనులను పర్యవేక్షించడానికి బీటెక్ పూర్తి చేసి తన వద్ద సూపర్వైజర్గా పనిచేస్తున్న వెప్పర్తి పుణ్యరాజు(23), డ్రైవర్ గరిగెబాటి నాగభూషణం(25), అడిగిబోయిన మనోహర్‌తో కలిసి బొలెరో వాహనంలో మండపేట నుంచి మంచిర్యాలకు ఆదివారం అర్ధరాత్రి బయల్దేరారు.
దూరప్రయాణం కావడంతో ఖమ్మం సమీపంలో వాహనం ఆపి కాసేపు నిద్రించారు. సోమవారం ఉదయంలోగా మంచిర్యాలకు చేరుకోవాలనే ఆతృతతో నిద్రమత్తులోనే బయల్దేరారు. ఈ క్రమంలో వర్ధన్నపేట శివారు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో రోడ్డుపక్కన నిలిచి ఉన్న లారీని బొలెరో వాహనం వేగంగా ఢీకొంది. ప్రమాదంలో సోమేశ్వర్రావు, పుణ్యరాజు, నాగభూషణం అక్కడికక్కడే మృతిచెందగా, మనోహర్ గాయాలతో ప్రాణాలతో బయట పడ్డాడు. అతడిని హుటాహుటిన 108లో వర్ధన్నపేట ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పంచనామా చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్సై వివరించారు.
వారం రోజుల క్రితమే వాహనం కొనుగోలు
పవర్ ప్లాంట్లలో కాంట్రాక్టర్‌గా పనులు చేస్తున్న సోమేశ్వర్రావు మండపేట నుంచి మంచిర్యాలకు దూరప్రయాణం కావడ ంతో వారం రోజుల క్రితమే బొలెరో వాహనాన్ని కొనుగోలు చేశారు. ఆ వాహనం వెనకభాగంలో వెల్డింగ్ మిషన్, రెండు గ్యాస్ సిలండర్లను వేసుకుని మంచిర్యాలకు బయల్దేరి ప్రమాదానికి గురయ్యారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు
సంఘటన స్థలాన్ని వరంగల్ అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు మామునూరు డీఎస్పీ సురేష్‌కుమార్‌తో కలిసిపరిశీలించారు. మృతుల వివరాలు తెలుసుకున్నారు. నిద్రమత్తులో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగిందని ఎస్పీ తెలిపారు.