ఉత్తమ ‘పుర’ సేవలపై అధ్యయనం
♦ పురపాలనపై వర్క్‌షాపులో మంత్రి కేటీఆర్
♦ ఈ నెల 27న చెన్నైలో పర్యటిస్తా
♦ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో అవలంబిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి వాటిని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో అమలు చేస్తామని పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. తమిళనాడులో నగర, పురపాలక సంస్థలకు నిధుల సమీకరణ కోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తమిళనాడు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక సంస్థ విజయవంతంగా సేవలందిస్తోందన్నారు. ఈ సంస్థ పనితీరుపై అధ్యయనం కోసం ఈ నెల 27న చెన్నైలో పర్యటించనున్నట్లు తెలిపారు. పురపాలనలో ఉత్తమ విధానాలపై శనివారం హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ)లో నిర్వహించిన సదస్సులో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌ను విశ్వనగరంగా, స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు ఉత్తమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. నగరంలో మంచి రోడ్లు, పరిశుభ్రమైన వీధులు, మౌలిక సదుపాయాల కల్పనకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ, జల మండలి విభాగాలు వంద రోజుల ప్రణాళికలను ప్రకటించాయన్నారు. పురపాలనలో నగర పౌరులను భాగస్వాములను చేయడానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ప్రతినిధులతో వార్డు కమిటీలు, బస్తీ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
దేశంలో మరెక్కడా నిర్వహించని విధంగా హైదరాబాద్‌లో స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ రెండు చెత్త డబ్బాల చొప్పున 44 లక్షల చెత్త డబ్బాలను పంపిణీ చేయడంతోపాటు 2,500 ఆటో టిప్పర్లను అందుబాటులోకి తెచ్చామని కేటీఆర్ తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం రూ. 200 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య మాట్లాడుతూ నగరంలోని పెద్ద కంపెనీలు, సాఫ్ట్వేర్ సంస్థల నుంచి సేకరిస్తున్న సామాజిక బాధ్యత నిధులను నగరాభివృద్ధి కార్యక్రమాలకు మళ్లించాలన్నారు. మహారాష్ట్రలోని పట్టణాలను బహిరంగ మల, మూత్ర విసర్జనరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆ రాష్ట్ర పురపాలకశాఖ కార్యదర్శి మనీషా పటాంకర్ వివరించారు.
నాగ్‌పూర్‌లో 24 గంటల నీటి సరఫరా, నీటి పునర్వినియోగం కోసం తీసుకుంటున్న చర్యలపై విశ్వరాజ్ ఇన్ఫ్రా సంస్థ ఎండీ అరుణ్ లఖానీ, బెంగళూరులో పన్నుల విధానంలో మార్పులపై నగర ఉప కమిషనర్ మల్లిఖార్జున్, ఢిల్లీలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై ఐఎల్ఎఫ్ఎస్ ఎండీ మహేశ్‌బాబు తదితరులు మాట్లాడారు. ఢిల్లీ, నాగ్‌పూర్, బెంగళూరు, మహారాష్ట్రల్లో ఉత్తమ పుర సేవలపై అధ్యయనం కోసం రాష్ట్ర అధికారుల బృందాలను పంపనున్నామని సదస్సు అనంతరం మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సదస్సుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాత, వరంగల్ కమిషనర్ సర్ఫరాజ్ అహమ్మద్‌లు హాజరయ్యారు.